కొచ్చి: స్పాట్ ఫిక్సింగ్ కేసు నుంచి కోర్టు విముక్తి కల్పించినా.. బిసిసిఐ మాత్రం భారత మాజీ పేసర్ శ్రీశాంత్, ఆటగాళ్లు అంకీత్ చవాన్‌లపై నిషేధం కొనసాగుతుందని పేర్కొంటోంది. బోర్డు వైఖరి చూస్తుంటే ఆటగాళ్లను మైదానంలోకి రానిచ్చేలా లేదు. ఇది ఇలా ఉండగా, కోర్టు తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ప్రాక్టీస్ మొదలు పెట్టాడు స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి బయటపడ్డ భారత మాజీ క్రికెటర్ శ్రీశాంత్.
ఆదివారం సాయంత్రం కొచ్చిలోని ఎడప్పల్లి హైస్కూల్ మైదానానికి చేరుకున్న శ్రీశాంత్.. తన గురువు శివకుమార్‌కు నెట్స్‌లో బంతులు వేశాడు. తొలిరోజుల్లో అతడు నిత్యం ప్రాక్టీస్ చేసింది కూడా ఇక్కడే. అభిమానులు కూడా అతడికి స్వాగతం పలికారు. అయితే బీసీసీఐ నిషేధం కొనసాతున్నందున శ్రీశాంత్‌కు కేరళ క్రికెట్ సంఘం మైదానాల్లోకి ప్రవేశం లేదు.
అలా ఐతే దుబాయ్‌లో ఉండేవాణ్ని

అంతకుముందు ఫిక్సింగ్ కేసు నుంచి విముక్తుడైన అనంతరం ఢిల్లీ నుంచి సొంత రాష్ట్రానికి వచ్చిన శ్రీశాంత్‌కు కొచ్చి విమానాశ్రయంలో అతడి కుటుంబసభ్యులు, బంధువులు, మద్దతుదారుల నుంచి ఘనస్వాగతం లభించింది. కష్టసమయంలో తన పక్షాన నిలిచిన కేరళీయులకు ఈ సందర్భంగా అతడు కృతజ్ఞతలు చెప్పాడు.
'నాకు దావూద్‌తో నిజంగా సంబంధముంటే ఏ దుబాయ్‌లోనో మరో ప్రాంతంలోనో ఉండేవాణ్ని. క్రికెటర్ అయ్యేవాణ్ని కాదు. నేను సంపాదించింతా కష్టార్జితం. నా వ్యక్తిత్వం, అంకితభావాన్ని ప్రశ్నించారు. ఫిక్సింగ్ ఆరోపణలన్నీ తొలగిపోయినందుకు ఆనందంగా ఉంది. మద్దతుగా నిలిచిన వాళ్లందరికీ కృతజ్ఞతలు' అని అన్నాడు.
తనపై ఉన్న అన్ని ఆరోపణలను కోర్టు కొట్టేయడం ఎంతో ఆనందాన్నిచ్చిందని తెలిపాడు. క్రికెట్ అంటే తన ప్రాణమని, క్రికెట్ ఆడేందుకే పుట్టానని చెప్పాడు. కెరీర్‌ను కొనసాగిస్తానని, తనపై విధించిన సస్పెన్షన్‌ను భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) కొట్టివేస్తుందని నమ్ముతున్నానని అన్నాడు.

నిషేధాన్ని ఎత్తివేయాలి: కెసిఎ
శ్రీశాంత్‌పై విధించిన జీవితకాల నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని బిసిసిఐని కేరళ క్రికెట్ సంఘం (కెసిఎ) కోరింది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటూ అతనిపై ఢిల్లీ పోలీసులు చేసిన అభియోగాల్లో వేటికీ సరైన సాక్ష్యాధారాలు లేవని పాటియాలా కోర్టు పేర్కొందని, అన్ని అరోపణల నుంచి అతనిని విముక్తి చేసిందని కెసిఎ గుర్తుచేసింది. కోర్టు తీర్పు నేపథ్యంలో శ్రీశాంత్‌కు మళ్లీ కెరీర్‌ను కొనసాగించే అవకాశాన్ని ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) సందర్భంగా వెలుగు చూసిన స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు చేసిన నేరారోపణలను రుజువు చేసే సాక్ష్యాధారాలు ఏవీ లేవన్న కారణంగా శ్రీశాంత్, అతనితోపాటు అరెస్టయిన రాజస్థాన్ రాయల్స్ జట్టులోని అతన సహచరులు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌సహా మొత్తం 36 మందిపై ఉన్న అభియోగాలను పాటియాలా కోర్టు కొట్టేసిన విషయం తెలిసిందే.