WT20 World Cup : టీ20 వరల్డ్ కప్‌లో స్పాట్ ఫిక్సింగ్ కలకలం.. లీకైన ఆడియో టేపు!

ప్రస్తుతం జరుగుతున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ను స్పాట్ ఫిక్సింగ్ భూతం కుదిపేస్తోంది. కొన్నిరోజుల క్రితం బంగ్లాదేశ్‌కు చెందిన ఒక మాజీ క్రికెటర్.. ప్రస్తుత జట్టులోని కొందరు సభ్యులను ఫిక్సింగ్ ఊబిలోకి లాగేందుకు ప్రయత్నించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బంగ్లా జట్టుకు చెందిన ఒక క్రీడాకారిణి కూడా అలాంటి పని చేయబోయినట్లు తెలుస్తోంది.
సౌతాఫ్రికా టీంకు చెందిన ఒక ప్లేయర్‌ను సదరు బంగ్లా క్రీడాకారిణి కాంటాక్ట్ అయింది. వీరి సంభాషణకు సంబంధించిన ఆడియో రికార్డింగులను ఢాకాకు చెందిన ఒక వార్తా సంస్థ ప్రసారం చేయడంతో ఈ విషయం వైరల్ అవుతోంది.

బలవంతం ఏం లేదు..!
ప్రస్తుతం వరల్డ్ కప్ ఆడుతున్న బంగ్లా జట్టులో లేని ఒక ప్లేయర్ ఈ పాడుపనికి పాల్పడింది. సౌతాఫ్రికా జట్టుకు చెందిన క్రీడాకారిణికి కాల్ చేసిన ఆమె.. 'నేనేం నిన్న బలవంతం చేయడం లేదు. ఫలానా మ్యాచ్ ఆడొద్దు అని నేను చెప్పను. అది నీ ఇష్టం. నువ్వే చెప్పు. ఒక మ్యాచ్ ఆడావనుకో.. తర్వాతి మ్యాచ్ ఆడతావో లేదో నిర్ణయించుకో. నువ్వు మ్యాచులో ఉండాలో వద్దో టీం మేనేజ్‌మెంట్ డిసైడ్ చేస్తుంది కదా' అని బంగ్లా ప్లేయర్ చెప్పింది.

దర్యాప్తు చేస్తున్న ఐసీసీ
ఆ మాటలు విన్న సఫారీ ప్లేయర్.. 'చూడు ఫ్రెండ్.. నాకు ఇలాంటివి అసలు వద్దు. నేను వీటిలో ఇరుక్కోవాలని అనుకోవడం లేదు. నా జీవితంలో ఇలాంటి పనులు చేయలేను. అసలు నాకు ఇవేమీ చెప్పొద్దు' అని స్పష్టం చేసేసింది. ఆ తర్వాత ఐసీసీ నిబంధనల ప్రకారం, విషయాన్ని యాంటీ కరప్షన్ యూనిట్‌కు తెలియజేసిందట. దీనిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రెసిడెంట్ నిజాముద్దీన్ చౌదరి కూడా స్పందించాడు. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నిబంధనల ప్రకారమే తాము ఈ విషయంలో నడుచుకుంటున్నామని చెప్పాడు.

నో కామెంట్..
ఆ ప్రకారమే విషయాన్ని ఐసీసీలోని ఏసీయూ విభాగానికి తెలియజేశామని చెప్పాడు. ఇది బీసీబీ దర్యాప్తు చేసే విషయం కాదని, దీనిపై ప్రస్తుతానికి తాము ఎలాంటి కామెంట్లు చేయలేమని చెప్పాడు. ఈ విషయంపై ఐసీసీ దర్యాప్తు కొనసాగుతోందని వెల్లడించాడు. అయితే ఈ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంపై ఐసీసీ నుంచి ఎలాంటి ప్రకటనా రాకపోవడం గమనార్హం. కాగా, ఈ మెగా టోర్నీలో భారత జట్టు తాము ఆడిన తొలి రెండు మ్యాచుల్లోనూ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications