న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పౌర పురస్కారానికి క్రీడా మంత్రిత్వ శాఖ హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేసింది. క్రికెట్ దిగ్దజం సచిన్ టెండూల్కర్ పేరును కాదని ధ్యాన్ చంద్ పేరను మంత్రిత్వ శాఖ సిఫార్సు చేసింది. ధ్యాన్ చంద్ 1979లో మరణించారు. మరణించిన 25 ఏళ్ల తర్వాత ఆయన పేరును భారత రత్న అవార్డుకు సిఫార్సు చేశారు.
క్రీడారంగం నుంచి దేశంలో భారతరత్నకు సిఫార్సు అయిన మొదటి పేరు ధ్యాన్ చంద్‌దే కావడం విశేషం. ధ్యాన్ చంద్ పేరును సిఫార్సు చేయడాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ సమర్థించుకుంది. ఇది న్యాయమైందేనని, ప్రధాని కార్యాలయానికి ఒక్క పేరును మాత్రమే సిఫార్సు చేయాల్సి ఉంటుందని శుక్రవారం తెలిపింది.

సచిన్ టెండూల్కర్ పట్ల కూడా తమకు గౌరవం ఉందని, అదే సమయంలో ధ్యాన్ చంద్ దేశ క్రీడాచరిత్రలో ఉత్తమ స్థానంలో ఉండదగినవారని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రదీప్ దేవ్ అన్నారు. భారత హాకీ చరిత్రకు ఇది చాలా గర్వకారణమని, ధ్యాన్ చంద్‌కు ఈ అవార్డు వస్తుందని తాము ఆశిస్తున్నామని హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ నరీందర్ బాత్రా అన్నారు.
మూడు సార్లు వరుసగా 1928, 1932, 1936 సంవత్సరాల్లో ఒలింపిక్స్‌లో భారతదేశానికి హాకీలో స్వర్ణపతకాలు సాధించి పెట్టాడు. ప్రపంచ హాకీ చరిత్రలో ధ్యాన్ చంద్‌ను మించిన క్రీడాకారుడు లేడని భావిస్తారు.