
ముంబై: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ వరుస విజయాలను సాధిస్తోంది. సెకెండ్ హాఫ్‌లో నాలుగు మ్యాచ్‌లను ఆడగా.. మూడింట్లో జయ కేతనాన్ని ఎగురవేసింది. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఈ నెల 26వ తేదీన అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలిచినంత పని చేసింది. తృటిలో విజయాన్ని చేజార్చుకుంది.
తనకంటే అన్ని రంగాల్లో బలమైన.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్‌ను మట్టికరిపించింది మోర్గాన్ సేన. తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఢీ కొట్టబోతోంది. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ మ్యాచ్ ఆరంభమౌతుంది. అందుబాటులో ఉన్న బ్యాటింగ్, బౌలింగ్ వనరులతోనే అద్భుత విజయాలను అందుకుంటోంది నైట్ రైడర్స్. ప్లే ఆఫ్ రేసులో నిలిచింది.
కాగా- కోల్‌కత నైట్‌రైడర్స్ స్టార్ స్పిన్ బౌలర్..చైనామన్‌గా పేరు తెచ్చుకున్న కుల్‌దీప్ యాదవ్ మోకాలికి నిర్వహించిన శస్త్ర చికిత్స విజయవంతమైంది. నైట్‌రైడర్స్ తరఫున ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ సెకెండ్ హాఫ్‌లో ఆడటానికి జట్టుతో కలిసి ఎమిరేట్స్ వెళ్లిన అతను..మోకాలి నొప్పితో బాధపడ్డాడు. దీనితో స్వదేశానికి వచ్చాడు. అనంతరం ముంబై ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోగా ఫ్రాక్చర్ ఏర్పడినట్లు గుర్తించారు డాక్టర్లు. అతని మోకాలికి శస్త్రచికిత్స చేశారు. ఈ ఆపరేషన్ విజయవంతమైంది.
ఎమిరేట్స్‌లో ఫీల్డింగ్ ప్రాక్టీస్ సమయంలో కుల్‌దీప్ యాదవ్ గాయపడ్డాడు. అతని మోకాలికి గాయమైంది. ఆసుపత్రి బెడ్‌పై నుంచి థమ్సప్ ఫొటోను కుల్‌దీప్ యాదవ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతని కుడి మోకాలికి కట్టుకట్టి ఉందా ఫొటోలో. సర్జరీ సక్సెస్ అయిందని, రికవరీ జర్నీ ఇప్పుడే ప్రారంభమైందని పేర్కొన్నాడు. ఈ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పాడు. ఇక త్వరగా కోలుకోవడంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని అన్నాడు. త్వరలోనే రికవరీ అవుతానని, గ్రౌండ్‌లో అడుగుపెడతాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు.
కుల్‌దీప్ యాదవ్ వందశాతం ఫిట్‌నెస్‌ను సాధించడానికి కనీసం ఆరు నెలల సమయం పట్టొచ్చని తెలుస్తోంది. ఫలితంగా- ఈ మధ్యకాలంలో జరిగే అన్ని క్రికెట్ టోర్నమెంట్స్, దేశీవాళీ ట్రోఫీల్లోనూ అతను కనిపించకపోవచ్చు. కుల్‌దీప్ యాదవ్ చివరిసారిగా క్రికెట్ మ్యాచ్ ఆడింది శ్రీలంక సిరీస్‌లో. శిఖర్ ధవన్ సారథ్యంలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన జట్టులో అతను సభ్యుడు. లంకేయులతో మూడు వన్డే ఇంటర్నేషనల్స్, టీ20ల్లో సిరీస్‌లను ఆడిందా టీమ్. ఐపీఎల్ 2021 కోసం ఎమిరేట్స్ వెళ్లినా.. ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.