
క్రికెట్ సౌతాఫ్రికా (CSA) ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరిలో జరగబోయే కొత్త టీ20లీగ్‌లో 25మందికి పైగా క్రికెటర్లు సైన్ చేశారు. వచ్చే ఏడాది జనవరిలో ఈ లీగ్ జరగనుంది. శ్రీలంక, వెస్టిండీస్‌ల నుంచి దాదాపు 10మంది ప్లేయర్లు ఈ టీ20లీగ్‌లో ఆడడానికి తాము సిద్ధమని చాటారు. శ్రీలంక, వెస్టిండీస్‌కు చెందిన ఆటగాళ్లే కాకుండా ఇంగ్లాండ్‌కు చెందిన దాదాపు 12మంది ప్లేయర్లు కూడా ఈ కొత్త టీ20లో ఆడడానికి రెడీ అయినట్లు సమాచారం. ఈ వార్త వెలుగులోకి రావడంతో మరో హాట్ వార్త కూడా చక్కర్లు కొడుతుంది. అది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు.
ఆ వార్తేంటంటే.. క్రికెట్ ఆస్ట్రేలియా (CA) నిర్వహించే బిగ్‌బాష్ కాంట్రాక్ట్‌లను డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, పాట్ కమ్మిన్స్, మిచెల్ స్టార్క్, కామెరాన్ గ్రీన్ తదితర స్టార్ వైట్ బాల్ ప్లేయర్లకు సీఏ అందజేయడం ప్రారంభిస్తోందట. బిగ్ బాష్ లీగ్ ఆదరణ కోల్పోకుండ ఉండడానికి ఈ నిర్ణయంతో పాటు.. ఒకవేళ పైన పేర్కొన్న ఆటగాళ్లు సౌతాఫ్రికా లీగ్‌లో పాల్గొనాలంటే.. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకోవాలట.
అప్పుడే వారు 'ఫ్రీ ఏజెంట్లుగా' మారి దక్షిణాఫ్రికా లీగ్‌లో పాల్గొనేందుకు అర్హులవుతారట. ఆస్ట్రేలియా తీసుకున్న నిర్ణయం కూడా కొంత సమంజసమే అనిపిస్తుంది. ఎందుకంటే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో స్టార్ ప్లేయర్లు పాల్గొనాలని చూస్తే.. బిగ్ బాష్ లీగ్ నిర్వహణకు మొదటికే మోసం వస్తుంది.
ఇకపోతే సౌతాఫ్రికా కొత్త టీ20 లీగ్‌లో ఇంగ్లాండ్ స్టార్ ప్లేయర్లు జోస్ బట్లర్, లియామ్ లివింగ్‌స్టోన్, ఇయాన్ మోర్గాన్, జాసన్ రాయ్, సామ్ కర్రాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్‌తో సహా పలువురు క్రికెట్లు పాల్గొననున్నారని విశ్వసనీయ సమాచారం. అలాగే వెస్టిండీస్ ప్లేయర్లు జాసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, శ్రీలంక ప్లేయర్లు దుష్మంత చమీరా, మహేశ్ తీక్షణ, భానుక రాజపక్స, ఐర్లాండ్ ప్లేయర్ హ్యారీ టెక్టర్ పాల్గొనడానికి సైన్ చేశారు.