అంతర్జాతీయ క్రికెట్‌కు స్టార్ ప్లేయర్ గుడ్ బై!
దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్, వెటరన్ బ్యాటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠభరితంగా సాగుతున్న సమయంలో 37 ఏళ్ల వయసులో ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన అంతర్జాతీయ కెరీర్లో దక్షిణాఫ్రికా తరఫున మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్.. తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించాడు.
సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశం
తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అత్యంత భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశాడు. "దక్షిణాఫ్రికా జెర్సీని ధరించడం అనేది ఓ ఆటగాడిగా నా జీవితంలో అత్యున్నత శిఖరం. ఈ ప్రయాణం నా పట్టుదలను, అంకితభావాన్ని నిరంతరం పరీక్షిస్తూనే.. మరిచిపోలేని గౌరవాన్ని అందించింది. నా దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద పురస్కారంగా భావిస్తాను" అని రాస్సీ వాన్ డెర్ డస్సెన్ రాసుకొచ్చాడు. అంతర్జాతీయ మ్యాచ్‌ల నుంచి తప్పుకున్నా.. దేశవాళీ క్రికెట్లో తన జట్టు 'లయన్స్' తరఫున ఆడతానని, భవిష్యత్తులో కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించే ఆలోచన ఉందని రాస్సీ వాన్ డెర్ డస్సెన్ స్పష్టం చేశాడు.

ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ ప్రయాణం
అంతర్జాతీయ వేదికలపై రాణించిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్.. ప్రపంచంలోనే అత్యంత సంపన్న లీగ్ అయిన ఐపీఎల్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. 2022లో రాజస్థాన్ రాయల్స్ తరఫున రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే ఆ జట్టులో ఉన్న విపరీతమైన పోటీ కారణంగా రాస్సీ వాన్ డెర్ డస్సెన్‌కు కేవలం మూడు మ్యాచ్‌ల్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత జరిగిన వేలంలో ఏ జట్టూ ఆసక్తి చూపకపోవడంతో ఐపీఎల్‌లో రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ప్రస్థానం త్వరగానే ముగిసింది.
విజయవంతమైన అంతర్జాతీయ కెరీర్
ఈ స్టార్ క్రికెటర్ రాస్సీ వాన్ డెర్ డస్సెన్ ఆలస్యంగా అంటే 2019లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికీ.. అతి తక్కువ కాలంలోనే దక్షిణాఫ్రికా జట్టు బ్యాటింగ్ వెన్నెముకగా మారాడు. తన కెరీర్లో మొత్తం 18 టెస్టులు, 71 వన్డేలు, 57 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 6 అర్థ సెంచరీలతో 905 పరుగులు సాధించగా.. వన్డేల్లో 6 సెంచరీలు, 17 అర్థ సెంచరీల సాయంతో 2,657 పరుగులు చేసి అద్భుతమైన సగటును నమోదు చేశాడు. టీ20 ఫార్మాట్లో 10 అర్థ శతకాలతో 1,406 పరుగులు బాదాడు.
ఓ శకం ముగిసింది..
ఆగస్టు 2025లో ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా దక్షిణాఫ్రికా జెర్సీలో కనిపించిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్.. తన ఆటతో జట్టుకు ఎన్నో క్లిష్ట సమయాల్లో అండగా నిలిచాడు. ముఖ్యంగా వన్డేల్లో డస్సెన్ స్థిరమైన బ్యాటింగ్ జట్టుకు ఎంతో బలాన్ని ఇచ్చేది. ఇప్పుడు ఆయన రిటైర్మెంట్‌తో దక్షిణాఫ్రికా మిడిలార్డర్‌లో ఓ శకం ముగిసినట్లయింది. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తూ సహచర ఆటగాళ్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications