
కరాచీ: పాకిస్థాన్ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మన్ బాబర్ అజామ్.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) విధించిన కరోనా వైరస్ రూల్స్ బ్రేక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటన దక్షిణాఫ్రికా టూర్ ముందు చర్చనీయాంశం అయింది. అజామ్ రూల్స్‌ని బ్రేక్ చేయడంతో.. అతనిపై చర్యలు తీసుకునేందుకు పీసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పాక్ మాజీలు కూడా బాబర్ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 2 నుంచి దక్షిణాఫ్రికా గడ్డపై మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ పాకిస్థాన్ ఆడనుంది.
కరోనా వైరస్ కారణంగా దక్షిణాఫ్రికా పర్యటనకు ఎంపికైన పాకిస్తాన్ జట్టు సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. తాజాగా పంజాబ్ స్పోర్ట్స్ బోర్డు డైరెక్టర్ జనరల్ అదాన్ అర్షద్‌ని కలిసేందుకు తన సొంత కారులో బాబర్ అజామ్ వెళ్లాడు. లోకల్ క్రికెట్ క్లబ్‌లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం బాబర్న్ అర్షద్‌ని కలిశాడు. బాబర్ అక్కడికి వెళ్లిన విషయాన్ని తెలుసుకుని మీడియా వెళ్లగా.. విషయం తెలుసుకున్న పాక్ కెప్టెన్ మీటింగ్ తర్వాత హుటాహుటిన అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు.
దక్షిణాఫ్రికా పర్యటనకి ఎంపికైన పాకిస్తాన్ ఆటగాళ్లకి మంగళవారమే పీసీబీ పర్యవేక్షణలో మొదటి కరోనా వైరస్ పరీక్ష నిర్వహించారు. ఆ ఫలితాలు ఇంకా రావాల్సి ఉంది. ఇంతలోనే బాబర్ అజామ్.. పీసీబీ ఆదేశాల్ని ఏమాత్రం పట్టించుకోకుండా డీజీని కలవడం పెద్ద చర్చనీయాంశమైంది. టీమ్ ఎంపికపై ఇటీవల అసహనం వ్యక్తం చేసిన బాబర్‌పై.. ఇప్పటికే పీసీబీ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఇప్పుడు పీసీబీ ఆదేశాలను కూడా పట్టించుకోకపోవడంతో.. అతడిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
బాబర్ అజామ్ చివరగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2021లో కరాచీ కింగ్స్ తరఫున ఆడాడు. పీఎస్ఎల్ 2021 మొదలైన కొన్ని రోజుల తర్వాత కరోనా కేసులు నమోదవడంతో టోర్నీని మధ్యలోనే వాయిదా వేశారు. పీఎస్ఎల్ 2021లో బాబర్ అదరగొట్టాడు. 62, 90 నాటౌట్, మరియు 77 నాటౌట్ స్కోర్‌లు చేశాడు. 26 ఏళ్ల బాబర్ పాక్ మూడు ఫార్మాట్‌లలో సారథిగా ఉన్నాడు. బాబర్ పాక్ తరఫున 31 టెస్టులు, 77 వన్డేలు, 47 టీ20లు ఆడాడు.