
గెలుపే లక్ష్యంగా భారత్
తొలి వన్డేలో ఓడిన భారత్ రెండో వన్డేలో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. తొలివన్డేలో జరిగిన తప్పులను ఈ మ్యాచ్‌లో పునరావృతం చేయకూడదని భావిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్‌లో మిడిలార్డర్ రాణించాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది. తొలి వన్డేలో టాపార్డర్ రాణించినప్పటికీ మిడిలార్డర్ చేతులెత్తేయడంతో భారత్ ఓటమి పాలైంది. అందుకే ఈ మ్యాచ్‌లో పంత్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ నుంచి టీమ్ మేనేజ్మెంట్ భారీ ఇన్నింగ్స్‌లు ఆశిస్తోంది.

తుది జట్టులో మార్పులు
తుది జట్టులో టీమిండియా మేనేజ్మెంట్ పలు మార్పులు చేసే అవకాశం ఉంది. బెంచ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని జట్టులోకి తీసుకునే ఆలోచనను కూడా చేస్తోంది. అదే జరిగితే శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్లలో ఒకరికే చోటు దక్కొచ్చు. ఇక బౌలింగ్‌లో పలు మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
తొలి వన్డేలో పరుగులు ఎక్కువగా ఇచ్చిన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ స్థానంలో యువ పేసర్ మహ్మద్ సిరాజ్ జట్టులోకివ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే తొలి వన్డేలో విఫలమైన స్పిన్నర్ చాహల్ స్థానంలో జయంత్ యాదవ్‌ను జట్టులో తీసుకోవచ్చు.

భారత్ తుది జట్టు (అంచనా)
రాహుల్ (కెప్టెన్), ధావన్, కోహ్లీ, పంత్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, అశ్విన్, శార్దూల్, మహ్మద్ సిరాజ్, బుమ్రా, చాహల్.

ఆత్మవిశ్వాసంతో సౌతాఫ్రికా
తొలి వన్డేలో విజయంతో రెండో వన్డేలో సౌతాఫ్రికా తగిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. తొలి వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టిన ఆ జట్టు రెండో వన్డేలోనూ అదే ఆట తీరు కనబర్చాలని పట్టుదలగా ఉంది. రెండో వన్డేలో గెలిచి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. రెండో వన్డేలో పెదగా మార్పులు లేకుండా తొలి వన్డేలో గెలిచిన జట్టునే కొనసాగించే అవకాశం ఉంది.

సౌతాఫ్రికా తుది జట్టు (అంచనా)
డికాక్, మలన్, బవుమా (కెప్టెన్), మార్క్రమ్, డుస్సెన్, మిల్లర్, ఫెలుక్వాయో, జాన్సెన్, కేశవ్ మహరాజ్, లుంగీ ఎన్గిడి, షంసీ.
పిచ్, వాతావరణం
తొలి వన్డే మ్యాచ్ జరిగిన పార్ల్‌లోనే రెండే వన్డే మ్యాచ్ కూడా జరగనుంది. వాతావరణం వేడిగా ఉండనుంది. పిచ్ నెమ్మదిగా ఉండడంతో పాటు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది. తొలి వన్డే మాదిరిగా టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది.