
హైదరాబాద్: కోహ్లీసేన కోసం దక్షిణాఫ్రికాలోని వాండరర్స్ మైదానం పేస్ పిచ్ ఎదురుచూస్తోందని దక్షిణాఫ్రికా మాజీ వికెట్ కీపర్ మార్క్ బౌచర్ అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇంకో టెస్టు మ్యాచ్ మిగిలుండగానే 0-2తో కోహ్లీసేన సిరిస్‌ను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
ఇరు జట్ల మధ్య జనవరి 24న జోహెన్స్‌బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టుల్లో కూడా దక్షిణాఫ్రికా బౌలర్లను ఎదుర్కొనడంలో కోహ్లీసేన విఫలమైంది. ముఖ్యంగా సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సఫారీ పేస్ బౌలర్ లుంగి ఎంగిడి భారత్ నడ్డి విరిచాడు.
రెండో టెస్టులో ఆరు వికెట్లు తీసి దక్షిణాఫ్రికా విజయంలో కీలకపాత్ర పోషించాడు. దీంతో ఈ టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో కోహ్లీసేన 135 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక, కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో 72 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
మూడో టెస్టుకు ఆతిథ్యమిస్తోన్న జోహెన్స్‌బర్గ్ వాండరర్స్ స్టేడియం పిచ్ గ్రీన్ వికెట్‌గా రూపొందించారు. దీనిపై మార్క్ బౌచర్ మాట్లాడుతూ 'గతంలో ఎన్నడూ చూడని విధంగా వాండరర్స్ పిచ్ గ్రీన్ వికెట్‌గా రూపుదిద్దుకుంటోంది. వాండరర్స్‌లో సఫారీ బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్ అడ్డుకోవడం కష్టమే' అని చెప్పాడు.
'వాండరర్స్ పిచ్ పేస్, బౌన్స్, స్వింగ్‌కు స్వర్గధామం. గతంలో ఇక్కడ ఇండియా టెస్టు మ్యాచ్ గెలిచింది. భారత బౌలర్లు రైట్ ప్లేస్‌లో బంతులను సంధిస్తే దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోకి నెట్టొచ్చు. ఇక, దక్షిణాఫ్రికా బౌలర్ల ఎత్తుని దృష్టిలో పెట్టుకుంటే భారత బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించడానికి చాలా కష్టపడాలి. కొన్ని బంతులు వారి చెవులను తాకుతూ వెళుతుంటాయి' అని బౌచర్ తెలిపాడు.
దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ డుప్లెసిస్, ఆ జట్టు స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ భారత్‌ను వైట్ వాష్ చేస్తామని ఇప్పటికే తమ మనసులోని మాటను వెల్లడించిన సంగతి తెలిసిందే. మరోవైపు భారత్ మాత్రం చివరి టెస్టులోనైనా విజయం సాధించి పరువు నిలబెట్టుకోవాలని చూస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.