
హైదరాబాద్: డర్బన్ వేదికగా ఆస్ట్రేలియా-ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న తొలి టెస్టుపై సఫారీ బోర్డు నిరాశకు గురైంది. ఎందుకంటే ఈ టెస్టుకు అసలు ప్రేక్షకులు రావడం లేదు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టెస్టు గురువారం (మార్చి 1) డర్బన్‌లోని కింగ్స్ మీడ్స్‌లో ప్రారంభమైంది.
తొలి రోజు 3,975 మంది అభిమానులు హాజరయ్యారు. ఆ తర్వాత రెండో రోజై శుక్రవారం ఈ సంఖ్య 4,865కు పెరిగింది. దాదాపు 18,000 సామర్థ్యం గల ఈ స్టేడియం జనాలు లేక బోసిపోతోంది. ఇరు జట్లలో కూడా చురకత్తుల్లా బంతులు విసిరే పేసర్లు, బంతిని అలవోకగా బౌండరీకి తరలించే ప్లేయర్లు ఉన్నారు.
ఓహో టికెట్ రేట్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయని అనుకుంటున్నారు. అలాంటిదేమీ లేదు. టికెట్ రేట్లు కూడా సాధారణంగానే ఉన్నాయి. విద్యార్థులు, పింఛన్ గ్రహీతలకు 60 ర్యాండ్లు (5.03 డాలర్లు), పెద్దలకు 100 ర్యాండ్లు (8.39 డాలర్లు). ఇక, ఈ స్టేడియంలో ఎక్కువ ధర వచ్చే టికెట్ ఖరీదు 230 ర్యాండ్లు.
టికెట్ తక్కువ ధరల్లో ఉండటంతో వాస్తవానికి ఈ మ్యాచ్‌కి హాజరయ్యే అభిమానులు ఆహారం, పానీయాలకు ఎక్కువ డబ్బులు వినియోగించుకోవచ్చు. అయినా సరే ఈ మ్యాచ్‌కి అభిమానులు హాజరు కాకపోవడంతో ఏం చేయాలో తోచక దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తలపట్టుకుంటుంది. 1992/93 నుంచి డర్బన్‌లో టెస్టులకు జనాలు ఎక్కువగా రారు.
ఈ స్టేడియంలో మ్యాచ్‌కి హాజరైన అత్యధిక సంఖ్య పదివేలకు దాటలేదంటే నమ్మండి. తాము ఎంతగా ప్రచారం చేసిన అభిమానులు స్టేడియాలకు రావడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రగ్బీ జట్టు షార్క్స్ మ్యాచ్ జరుగుతుండటం, క్రికెట్ ప్రత్యక్ష ప్రసారం అవుతుండటమే ఇందుకు కారణాలని చెబుతున్నారు.