
హైదరాబాద్: బాగా ఆడుతున్నా జట్టు నుంచి తప్పించారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సురేశ్ రైనాను తిరిగి టీ20ల నిమిత్తం జట్టులోకి తీసుకున్నారు. అయితే తీసుకున్న రెండో మ్యాచ్‌లోనూ 30కి మించి పరుగులు చేయకపోవడంతో అతనికి ఇంకో అవకాశం కూడా మిగిలి ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది కూడా సరిగ్గా వినియోగించుకోకపోతే మళ్లీ వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.
ఏడాది కాలం తర్వాత పునరాగమనం చేసిన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనా తన మార్క్ ఇన్నింగ్స్ చూపించలేకపోయాడు. ఒకవైపు మనీశ్ పాండే, కేదార్ జాదవ్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ లాంటి యువ బ్యాట్స్‌మెన్‌లు జట్టులో స్థానం కోసం పోటీపడుతున్న ఈ తరుణంలో.. సురేశ్ రైనా ఫామ్‌ని నిరూపించుకోలేకపోతే మరో ఛాన్స్ ఇచ్చేందుకు సెలక్టర్లు మొగ్గు చూపకపోవచ్చు.
ఈ మ్యాచ్‌లో రైనా.. కనీసం అర్ధశతక ఇన్నింగ్స్ ఆడగలిగితేనే.. మార్చి 6 నుంచి 18 వరకు శ్రీలంకలో జరగనున్న ముక్కోణపు టీ20 సిరీస్‌కి అతడ్ని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నారట. ఈ వారం చివర్లో సెలక్టర్లు జట్టుని ప్రకటించనున్నారు. షార్ట్ పిచ్ బంతుల్ని సిక్సర్లుగా మలిచేందుకు ఎక్కువ తహతహలాడే.. సురేశ్ రైనా.. ఈ రెండు టీ20ల్లోనూ బంతిని గాల్లోకి ఆడేందుకు ప్రయత్నించాడు.
దక్షిణాఫ్రికాతో గత ఆదివారం జరిగిన తొలి టీ20లో 7 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 15 పరుగులు చేసిన ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్.. బుధవారం రాత్రి ముగిసిన రెండో టీ20లో 24 బంతుల్లో 5 ఫోర్ల సాయంతో 30 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దక్షిణాఫ్రికాతో శనివారం చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.
సఫారీ పిచ్‌లపై కాసేపు క్రీజులో కుదురుకోగలిగితే.. తర్వాత భారీ షాట్లు ఆడే అవకాశం ఉంటుందని.. రెండో టీ20లో అర్ధశతకాలు బాదిన మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోనీ నిరూపించారు. దీంతో.. చివరి టీ 20లో తన శైలీ ప్రదర్శన చేసి స్కోరును చేయగలిగితేనే పునర్వైభవాన్ని చూడగలడు.