
హైదరాబాద్: భారత్‌తో జరిగిన మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది సఫారీ జట్టు. వాండరర్స్ మైదానంలో చివరి టెస్టు అనంతరం సఫారీ జట్టు ట్రోఫీ అందుకుని సంబరాలు చేసుకుంది. ఇదే ఇప్పుడు వారి కొంపముంచింది. చివరి టెస్టులో ఓడిపోయినా సిరీస్‌ను గెలుచుకుని సంబరాలు చేసుకుంది.
ఈ సంబరాల్లో తీసుకున్న ఫొటోలో దక్షిణాఫ్రికా జట్టు ఆటగాళ్లు నిలుచున్న తీరు వివాదాస్పదంగా మారింది. ఇందులో ఒక పక్క డూప్లెసిస్, ఎల్గర్, డివిలియర్స్, మోర్కెల్, మోరిస్, డీకాక్, స్టెయిన్ తదితరులు ఉన్నారు. మరోపక్క రబాడ, ఎంగిడి, ఫిలాండర్, కేశవ్ మహారాజ్, ఫెలుక్వాయో ఉన్నారు. ఆటగాళ్లు కావాలని అలా నిల్చున్నారో.. ఎందుకు అలా నిల్చున్నారో తెలియదు గానీ ఈ ఫొటో ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
దేశం తరఫున ఆడుతోన్న ఆటగాళ్ల మధ్య వర్ణ వివక్ష ఉందని ఈ ఫొటో రుజువు చేస్తోందంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన ఫిలాండర్, ఎంగడి, రబాడలను కలుపుకోలేకపోయారని ట్వీట్ల వర్షం కురిపించారు.
దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే జరుగుతోంది. 'ఆటగాళ్ల మధ్య ఎలాంటి వివక్ష లేదని, వారంతా ఒకటేనని' ఆ దేశ క్రికెట్ బోర్డు సీఈవో తబాంగ్ మోరోయ్ తెలిపారు. దీనిపై ఆయన తాజాగా మాట్లాడుతూ..'జట్టులో ఆటగాళ్ల మధ్య ఎలాంటి తేడాలు లేవు. అందరూ దేశం తరఫునే ఆడారు. ఓ మ్యాచ్‌లో రబాడ కీలక వికెట్ తీసినప్పుడు సారథి డూప్లెసిస్ అతడ్ని నుదురుపై ముద్దుపెట్టుకోవడం మనందరం చూశాం.
ఇలాంటి సంఘటనలు గురించి ఎందుకు మాట్లాడరు. జట్టు ఎంపిక విషయంలో ఏమాత్రం నియమాలను ఉల్లంఘించడం లేదు. తుది పదకొండులో ఇద్దరు నల్ల ఆఫ్రికన్లు ఉండాలనే నియయాన్ని అనుసరిస్తూనే ఉన్నాం' అని తబాంగ్ స్పష్టం చేశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.