
జోహనెస్‌బర్గ్: యూఏఈ, ఒమన్ వేదికగా అక్టోబరు 17 నుంచి నవంబరు 14 వరకూ మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్ 2021 జరుగనుంది. ఇందుకోసం అన్ని టీమ్స్ తమ జట్లను ప్రకటిసున్నాయి. తాజాగా 15 మందితో కూడిన దక్షిణాఫ్రికా జట్టుని ఆ దేశ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. ప్రొటీస్ సీనియర్ ప్లేయర్లు ఫాఫ్ డుప్లెసిస్, క్రిస్ మోరీస్‌కి దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు చోటివ్వలేదు. టీ20 స్పెషలిస్ట్‌లుగా పేరొందిన ఈ ఇద్దరూ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రైవేట్ టీ20 లీగ్స్‌లో ఆడుతూ ఫామ్‌లో ఉన్నప్పటికీ బోర్డు వారిని పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడిన ఫాఫ్ డుప్లెసిస్.. కేవలం 60 బంతుల్లోనే 120 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఐపీఎల్ 2021 మొదటి దశలో కూడా పరుగుల వరద పారించాడు. హాఫ్ సెంచరీలతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మంచి విజయాలు అందించాడు. మరోవైపు క్రిస్ మోరీస్ కూడా ఇటీవలి కాలంలో బాగానే ఆడాడు. అతడిని ఐపీఎల్‌లో రూ 16.25 కోట్లు వెచ్చించి మరీ రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. అలాంటి ప్లేయర్‌కి కనీసం జట్టులో కూడా దక్షిణాఫ్రికా చోటివ్వలేదు. ఇక సీనియర్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌కు కూడా చోటివ్వలేదు.
టీ20 ప్రపంచకప్ 2021 కోసం దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సీనియర్ ప్లేయర్లను కూడా పక్కనపెట్టింది. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆడిన టీమ్‌లోని ముగ్గురు ఆటగాళ్లు మాత్రమే.. మళ్లీ తాజాగా జట్టులోకి ఎంపికయ్యారు. క్వింటన్ డికాక్, డేవిడ్ మిల్లర్, కగిసో రబాడలు మాత్రమే అప్పటి జట్టులో ఆడారు. జార్న్ ఫోర్టిన్, వియాన్ మల్డర్ వంటివారికి దక్షిణాఫ్రికా అవకాశం ఇచ్చింది. జార్జ్ లిండే, అండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్ రిజర్వ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు. తెంబా బవుమా సారధ్య బాధ్యతలు చేపట్టనున్నాడు.
దక్షిణాఫ్రికా టీ20 ప్రపంచకప్ జట్టు:
తెంబా బవుమా (కెప్టెన్), కేశవ్ మహరాజ్, క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), జార్న్ ఫోర్టిన్, రీజా హెండ్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, ఐడెన్ మార్క్రామ్, డేవిడ్ మిల్లర్, డబ్ల్యూ ముల్డర్, లుంగీ ఎన్గిడి, అన్రిచ్ నార్ట్జే, డ్వైన్ ప్రిటోరియస్, కగిసో రబాడా, తబరైజ్ షమ్సి, రాసీ వాన్ డెర్ డ్యూసెన్.
రిజర్వ్ ప్లేయర్లు: జార్జ్ లిండే, అండిలే ఫెహ్లుక్వాయో, లిజాద్ విలియమ్స్.