టీ20ల్లో బ్యాటర్లు పరుగుల వరద పారిస్తుంటారన్న సంగతి తెలిసిందే. బ్యాట్ పడితే బంతిని ధనాధన్ బాదుతూ రన్ మెషీన్ లా పరిగెడుతుంటారు. అయితే తాజాగా సౌతాఫ్రికా మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ టీ20ల్లో అదిరే రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఈ టీ20 ఫార్మాట్ లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి దక్షిణాఫ్రికా ప్లేయర్ గా ఘనత సాధించాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్-2025లో భాగంగా ప్రిటోరియా క్యాపిటల్స్ - పార్ల్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘనత సాధించాడు.
ఈ పోరులో 213 పరుగుల లక్ష్య ఛేదనలో 24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన మిల్లర్ 48 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. దీంతో మిల్లర్ తన మొత్తం టీ20 కెరీర్‌లో 468 ఇన్నింగ్స్‌లు ఆడి 11,046 పరుగులు టచ్ చేశాడు.

గంటల వ్యవధిలోనే మరో ప్లేయర్
మిల్లర్ 11 వేల టీ20 రన్స్ క్లబ్‌లో చేరిన కాసేపటికే మరో దక్షిణాఫ్రికా ప్లేయర్ కూడా ఈ మార్క్ ను టచ్ చేశాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా ఈ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోనే 11 వేల పరుగుల ఫీట్ ను అందుకున్నాడు. ఎంఐ కేప్‌టౌన్‌తో జరిగిన మ్యాచ్‌లో డుప్లెసిస్ ఈ ఘనతను సాధించాడు. మొత్తంగా కెరీర్ లో 376 ఇన్నింగ్స్‌లు ఆడిన డుప్లెసిస్ 11,042 పరుగులు ఖాతాలో వేసుకున్నాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన సౌతాఫ్రికా ప్లేయర్స్
డేవిడ్ మిల్లర్ - 11046
డుప్లెసిస్ - 11042
డికాక్ - 10620
ఏబీ డివిలియర్స్ - 9424
రిలీ రొస్సో - 9067