Women's T20 World Cup : ఆ ఇద్దరే ఫైనల్ చేర్చారు.. సెమీఫైనల్ మ్యాచ్ అంటే ఇలా ఉండాలి!

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్ అభిమానులను ఉర్రూతలూగించింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి సెమీఫైనల్ చూసిన ఫ్యాన్స్.. రెండో సెమీఫైనల్ కోసం ఉత్సాహంగా ఎదురు చూశారు. ఈ మ్యాచ్‌లో తలపడిన సౌతాఫ్రికా, ఇంగ్లండ్ కూడా అభిమానుల బ్లడ్ ప్రెషర్ పెంచాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకట్టుకోగా.. బౌలింగ్ విభాగం కూడా చెలరేగింది. దీంతో కేప్‌టౌన్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో చివరకు సౌతాఫ్రికా గెలిచింది. ఈ క్రమంలో ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకునేందుకు సఫారీ అమ్మాయిలు రెడీ అయ్యారు.

అదిరిపోయే ఆరంభం.
.
రెండో సెమీఫైనల్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికాకు అద్భుతమైన ఆరంభం లభించింది. లారా వోల్వార్ట్ (53), తాజ్‌మిన్ బ్రిట్స్ (68) అద్భుతంగా ఆడారు. వీళ్లిద్దరూ చూడచక్కని షాట్లతో ఆ జట్టుకు మంచి స్కోరు అందించేలా కనిపించారు. అయితే ఎక్సెల్‌టోన్ బౌలింగ్‌లో లారా అవుటైంది. అప్పుడు క్రీజులోకి వచ్చిన మరిజానే కాప్ (13 బంతుల్లో 27 నాటౌట్) ఆకాశమే హద్దుగా చెలరేగింది. దీంతో సౌతాఫ్రికా అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సోఫీ ఎక్సెల్‌టోన్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. లారెన్ బెల్ ఒక వికెట్ తీసుకుంది.

తడబడిన ఇంగ్లిష్ అమ్మాయిలు..
లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్‌కు కూడా మంచి ఆరంభమే లభించింది. డానీ వ్యాట్ (34), సోఫియా డంక్లీ (28) అద్భుతంగా ఆడారు. ముఖ్యంగా సోఫియా ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. ఆ తర్వాత వచ్చిన అలైస్ కాప్సీ (0) డకౌట్ అయింది. స్టార్ ప్లేయర్ నాట్ సివర్ బ్రంట్ (40) రాణించింది. కానీ కీలకమైన సమయంలో ఆమె అవుట్ అయింది. ఇక్కడి నుంచి కెప్టెన్ హెదర్ నైట్ (31) చివరి వరకు ఒంటరి పోరాటం చేసింది. ఆమెకు సహకారం అందించడంలో అమీ జోన్స్ (2), సోపీ ఎక్సెల్‌టోన్ (1), కాథరీన్ సివర్ బ్రంట్ (0) విఫలమయ్యారు. ఇక చివరి ఓవర్లో నైట్ కూడా పెవిలియన్ చేరింది. సారా గ్లెన్ (8 నాటౌట్), చార్లీ డీన్ (1 నాటౌట్) క్రీజులో ఉన్నా కూడా ఏం చెయ్యలేకపోయారు.

తొలిసారి ఫైనల్‌లో..
దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్ జట్టు 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది. సఫారీ బౌలర్లలో అయబోంగా ఖాకా ఏకంగా నాలుగు వికెట్లు తీసుకోగా.. బ్యాటింగ్‌లో అదరగొట్టిన బ్రిట్స్ నాలుగు క్యాచులు అందుకొని ఫీల్డింగ్‌లో కూడా సత్తా యాటింది. చివరి ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన సఫారీ పేసర్ ఇస్మాయిల్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. నడైన్ డి క్లార్క్ ఒక వికెట్ తీసుకుంది. దీంతో ఆరు పరుగుల తేడాతో ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన సౌతాఫ్రికా అమ్మాయిలు.. మొట్టమొదటి సారి టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో అడుగుపెట్టారు. ఆదివారం నాడు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు కప్పు కోసం తలపడతాయి. మరి ఇదే జోరు కొనసాగించి తొలి కప్పు కూడా సఫారీలు అందుకుంటారేమో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications