కింగ్స్‌టౌన్ వేదికగా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో నేపాల్‌పై దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లకు 115 పరుగులు చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (43; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రిస్టన్ స్టబ్స్ (27 నాటౌట్; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు. కుశాల్ (4/19) నాలుగు, దీపేంద్ర సింగ్ (3/21) మూడు వికెట్లతో సత్తాచాటారు.
అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ (42; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), అనిల్ సా (27; 24 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడారు. షంసీ (4/19) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. నేపాల్ విజయానికి ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమవ్వగా గుల్షాన్ జా (6; 6 బంతుల్లో, 1 ఫోర్) రనౌటవ్వడంతో దక్షిణాఫ్రికా ఊపిరిపీల్చుకుంది.

అయితే ఒక్క పరుగుల స్పల్ప తేడాతో గెలిచిన దక్షిణాఫ్రికా పలు రికార్డులు బద్దలకొట్టింది. టీ20ల్లో ఒక్క పరుగు తేడాతో అత్యధిక సార్లు విజయం సాధించిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకెక్కింది. పొట్టి ఫార్మాట్‌లో సఫారీ సేన ఏకంగా అయిదు సార్లు ఒక్క పరుగుతో గట్టెక్కింది. ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, ఐర్లాండ్, కెన్యా రెండు సార్లు ఒక్క పరుగు తేడాతో విజయతీరాలకు చేరాయి. ఇక టీ20 వరల్డ్ కప్‌లో ఒక్క పరుగుతో అత్యధిక సార్లు గెలిచిన జట్టు కూడా సౌతాఫ్రికానే.
అయితే ఈ రికార్డు భారత్‌తో సమంగా పంచుకుంది. టీ20 ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా రెండు సార్లు ఒక్క పరుగుతో ఊపిరిపీల్చుకున్నాయి. ఇవాళ నేపాల్‌తో, 2009లో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా పరుగు తేడాతో గెలిచింది. 2012లో దక్షిణాఫ్రికాపై, 2016లో బంగ్లాదేశ్‌పై భారత్ వన్ రన్‌తో నెగ్గింది. కాగా, సఫారీ సేన మరో రికార్డును సాధించింది. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తక్కువ స్కోరును డిఫెండ్ చేసిన జట్టుగా సౌతాఫ్రికా రెండో సారి నిలిచింది. ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 114 పరుగులను, నేపాల్‌పై 116 స్కోరును కాపాడుకుంది. పొట్టి కప్‌లో విజయవంతమైన తక్కువ స్కోరులు ఇవే!