

హైదరాబాద్: 2019 వరల్డ్ కప్ తర్వాతే పరిమిత ఓవర్ల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని దక్షిణాఫ్రికా పేస్ బౌలర్ డేల్ స్టెయిన్ స్పష్టం చేశాడు. గత రెండేళ్లుగా ఎక్కువగా గాయాలతోనే సతమతమవుతున్న డేల్ స్టెయిన్ ఇటీవలే శ్రీలంక పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నాడు.
తన అనుభవాన్ని, ప్రదర్శనను దృష్టిలో పెట్టుకోని రానున్న వరల్డ్ కప్‌కు ఎంపిక చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు. తాజాగా ఓ కార్యక్రమానికి హాజరైన డేల్ స్టెయిన్ వచ్చే ఏడాది ఇం గ్లండ్‌లో జరిగే ప్రపంచక్‌పలో ఆడాలనుకుంటున్నా. ఆ తర్వాత మాత్రం దక్షిణాఫ్రికా తరఫున తెల్లబంతితో క్రికెట్ ఆడాలనుకోవడం లేదు" అని అన్నాడు.
"మా(దక్షిణాఫ్రికా) బ్యాటింగ్ లైనప్ చూడండి. టాప్‌లో ఉన్న ఆరుగురు ఆటగాళ్లు కలిపి 1000 మ్యాచ్‌లు ఆడారు. కానీ లోయర్ ఆర్డర్‌కి వచ్చే సరికి అంతా కలిపి 150 మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ప్రతీసారి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నాకున్న అనుభవం కారణంగా కచ్చితంగా జట్టులో చోటు దక్కుతుందనుకుంటున్నా" అని స్టెయిన్ తెలిపాడు.
"మరో వరల్డ్ కప్ వచ్చే సరికి నాకు 40 ఏళ్లు నిండుతాయి. అప్పుడు ఎలాగో తప్పుకోవాల్సిందే. అయితే టెస్టుల్లో మాత్రం కొనసాగుతాను" అని 35 ఏళ్ల స్టెయిన్ వ్యాఖ్యానించాడు. ఇక, శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌పై స్టెయిన్ మాట్లాడుతూ "ప్రస్తుతం నేను గాయాల బారి నుంచి కోలుకున్నాను. పూర్తి ఫిట్‌నెస్ సాధించాను. ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టుల్లోనూ ఆడాను. నా వరకు మంచి ప్రదర్శనే ఇచ్చానని అనుకుంటున్నాను. కానీ శ్రీలంకతో జరిగే వన్డే సిరీస్ జట్టులో చోటు సంపాదించుకోలేక పోయాను. గాయాల నుంచి కోలుకోవడమనేది అంత తేలికైన విషయమేమీ కాదు" అని పేర్కొన్నాడు.
కాగా, ఇటీవల శ్రీలంకతో జరిగిన రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో దక్షిణాఫ్రికా 2-0తో వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. గాలేలో జరిగిన మొదటి టెస్టులో రెండు వికెట్లు తీసిన స్టెయిన్.. రెండో మ్యాచ్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.