
హైదరాబాద్: భారత్‌తో తలపడి వరుస వైఫల్యాలు ఎదుర్కొంటున్న సఫారీ జట్టుకు వన్డే సిరీస్‌లోనే కాదు. టీ 20ల్లోనూ అదే ఫలితాలతో నిరుత్సాహంలో కూరుకుపోయింది. కానీ, బుధవారం జరగనున్న రెండో టీ20 ఆడి విజేతగా నిలవాలని తెగ ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే సఫారీ జట్టు ఫాస్ట్ బౌలర్ అయిన జూనియర్ డాలా గెలుస్తామంటూ, ఇందుకోసం కాస్త తెలివిగా ఆలోచిస్తే సరిపోతుందంటూ.. గట్టి విశ్వాసంతో మీడియా ముందు తన భావాలు ఇలా పంచుకున్నాడు.
'ఏదైన వ్యూహం సరిగ్గా అమలు చేయలేకపోతే.. అది చెత్తగా కనిపిస్తుంది. నిజాయతీగా చెప్పాలంటే తొలి టీ20లో దక్షిణాఫ్రికా బౌలర్ల వద్ద సరైన గేమ్ ప్లాన్ లేదు. ఈ కారణంగానే.. ధావన్ జోరు పెంచగానే లయ తప్పాం. ఆ సమయంలో రెండో గేమ్ ప్లాన్ మా వద్ద ఉండింటే బాగుండేది. ప్రత్యర్థి ఒక వ్యూహాన్ని చిత్తు చేసినప్పుడు.. జట్టు ఇంకొంచెం లౌక్యంగా వ్యవహరించాలి. రెండో టీ20లోనూ ఓ వ్యూహంతో బరిలోకి దిగుతున్నాం.. అయితే.. ఈ సారి తెలివిగా వ్యవహరిస్తాం' అని జూనియర్ డాలా ధీమా వ్యక్తం చేశాడు.
గత ఆదివారం రాత్రి జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ సఫారీ బౌలర్.. తొలి మ్యాచ్‌లోనే రోహిత్ శర్మ, సురేశ్ రైనా వికెట్లని పడగొట్టి అందర్నీ ఆకర్షించాడు. కానీ.. మ్యాచ్ మధ్యలో ధావన్ దూకుడు పెంచడంతో లయ తప్పిన డాలా.. చివర్లో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. తనతో పాటు జట్టులోని మిగతా బౌలర్లు కూడా లయ తప్పడంతోనే టీమిండియా భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించగలిగిందని ఈ కుర్ర బౌలర్ అభిప్రాయపడ్డాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు శిఖర్ ధావన్ 39 బంతుల్లో 72పరుగులు చేశాడు. భారత జట్టు జోరుతో 203 పరుగులు చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా 175 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో భారత్ 28 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.