పాపం దక్షిణాఫ్రికా.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 6 పాయింట్లు కోత!!

జోహానెస్‌బర్గ్: గతకొంత కాలంగా దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. స్టార్ ఆటగాళ్లు దూరమవడంతో అన్ని ఫార్మాట్‌లలో ఘోర పరాజయాలను చవిస్తోంది. ఇటీవల ఆడిన మూడు టెస్ట్ సిరీస్‌లను చేజార్చుకుంది. తాజాగా సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కోల్పోయింది. స్వదేశంలో శ్రీలంక చేతిలో 0-2తో పరాజయంపాలైన ప్రొటీస్.. భారత గడ్డపై కూడా 0-3తో చిత్తుగా ఓడింది.

6 పాయింట్లు కోత:
ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ మొదలు పెట్టినప్పటినుండి దక్షిణాఫ్రికా ఒక మ్యాచ్ గెలిచింది. ఇంగ్లండ్‌పై తొలి టెస్టు గెలిచి 30 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. అయితే జోహానెస్‌బర్గ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్లో ఓవర్‌రేట్ కారణంగా దక్షిణాఫ్రికా ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఐసీసీ 60 శాతం కోత పెట్టింది. అంతేకాకుండా టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 6 పాయింట్లు కోత విధించింది. దీంతో టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఇటీవలే ఖాతా తెరిచిన దక్షిణాఫ్రికాకు నిరాశే మిగిలింది.

24 టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లు:
ప్రస్తుతం దక్షిణాఫ్రికా ఖాతాలో 24 టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లు ఉన్నాయి. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఐసీసీ ఓ జట్టుకు పాయింట్ల కోత విధించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం టెస్టు ఛాంపియన్‌షిప్‌లో 360 పాయింట్లతో టీమిండియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా (296) ఇంగ్లండ్ (146), పాకిస్థాన్ (80), శ్రీలంక (80), న్యూజిలాండ్ (60)లు వరుసగా ఉన్నాయి. వెస్టిండీస్ (0), బంగ్లాదేశ్ (0)లు ఇంకా ఖాతా తెరవలేదు.

ప్రతి సిరీస్‌కు 120 పాయింట్లు:
టెస్టు ఛాంపియన్‌షిప్‌లో నిర్వహించే ప్రతి సిరీస్‌కు ఐసీసీ 120 పాయింట్లు కేటాయించింది. ఒక సిరీస్‌లో రెండు టెస్టులే ఉంటే.. ప్రతి మ్యాచ్‌కు 60 పాయింట్లు ఇస్తారు. ఒకవేళ మూడు టెస్టు మ్యాచుల సిరీస్ ఉంటే.. ప్రతి మ్యాచ్‌కు 40 పాయింట్లు కేటాయిస్తారు. ఇక ఐదు టెస్టుల సిరీస్‌లో ప్రతి మ్యాచ్‌కు 24 పాయింట్లు ఉంటాయి. మొత్తం తొమ్మిది జట్లు తలపడుతున్న ఈ ప్రపంచ ఛాంపియన్‌షిన్‌లో 2021 జూన్‌లో టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఫైనల్ ఉంటుంది.

ఇదే మొదటిసారి:
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టెస్టులో ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన ఇంగ్లండ్ 191 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. దీంతో సొంతగడ్డపై దక్షిణాఫ్రికా జట్టుకు మరో పరాభవం ఎదురైంది. తొలి టెస్టు నెగ్గి కోలుకున్నట్లు కనిపించిన దక్షిణాఫ్రికా.. ఆ తర్వాత పేలవ ప్రదర్శనతో వరుసగా మూడు టెస్టులు ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. 2004-05 తర్వాత దక్షిణాఫ్రికా వరుసగా 3 టెస్టు సిరీస్‌లు కోల్పోవడం ఇదే మొదటిసారి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications