
ఆదివారం నుంచి ఇండియా, సౌతాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సఫారి జట్టు కెప్టెన్ డీన్ ఎల్గర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు నంబర్ వన్ అని చెప్పుకొచ్చాడు. అయితే స్వదేశంలో ఆడడం తమకు కలిసొచ్చే అంశమని, సిరీస్‌లో తామే పై చేయి సాధిస్తామని ఎల్గర్ ధీమా వ్యక్తం చేశాడు. ర్యాకింగ్స్‌లో వారు నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ, వారు కొంతకాలంగా మెరుగ్గా ఆడుతున్నప్పటికీ హోం గ్రౌండ్ కారణంగా సౌతాఫ్రికాలో తమకే అనుకూలంగా ఉంటుందని అని అన్నాడు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ బలంగా ఉందన్న ఎల్గర్.. వారి బౌలింగ్ యూనిట్ గురించి తమకు తెలుసని చెప్పాడు. ఇటీవల టీమిండియా పేస్ బౌలింగ్ యూనిట్ చాలా విజయాలను నమోదు చేసిందని గుర్తు చేశాడు. అంతేకాకుండా టీమిండియాలో అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారని, జట్టుకు మంచి బౌలింగ్ బ్యాకప్ కూడా ఉందని కొనియాడాడు.
సౌతాఫ్రికాలోని పరిస్థితులను టీమిండియా పేసర్లు బాగా సద్వినియోగం చేసుకుంటారని తాను అనుకుంటున్నట్టు చెప్పాడు. అదే సమయంలో తమ సీమర్లలో పేస్, బౌన్స్ కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పేస్ పిచ్‌లు సౌతాఫ్రికాలో ఉంటాయని ఎల్గర్ అన్నాడు. ప్రస్తుత టీమిండియా ఇంగ్లండ్, ఆస్ట్రలియాలో మంచి విజయాలు సాధించిందని, కనుక తాము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీమిండియా మెరుగ్గా ఉందని అన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇదే చెప్పినట్టు ఎల్గర్ గుర్తు చేశాడు. సౌతాఫ్రికాలో తమ రికార్డును మెరుగుపరచుకునేందుకు టీమిండియా కచ్చితంగా ప్రయత్నిస్తుందని అన్నాడు. అయితే టీమిండియా ప్రయత్నాలను అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. సిరీస్‌లో సౌతాఫ్రికానే హాట్‌ఫెవరేట్ అన్నాడు. ఇది ఉత్తేజకరమైన సవాల్‌తో కూడిన సిరీస్ అన్న ఎల్గర్.. సౌతాఫ్రికాకు కెప్టెన్‌గా ఉన్నంతవరకు ఇక్కడ సిరీస్ గెలవాలనే ఇండియా కల నెరవేరకుండా అడ్డుకంటానని తెలిపాడు. తమను ఓడించడం టీమిండియాకు అసాధ్యం అన్నాడు. అంతేకాకుండా దక్షిణాఫ్రకా పర్యటనలో టీమిండియా 7 సార్లు ఓడిపోయిందని, ఇప్పుడు కూడా తామే గెలుస్తామిన ధీమా వ్యక్తం చేశాడు.
మరోవైపు టీమిండియా మాత్రం ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. ఎలాగైనా ఈ సారి సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్రం తిరగరాయడమే లక్ష్యంగా శ్రమిస్తోంది. కాగా ప్రపంచంలోని అన్ని దేశాల్లో టెస్ట్ సిరీస్ గెలిచిన భారత్.. ఇప్పటివరకు ఒక్కసారి కూడా సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవలేదు. మరోవైపు ఆదివారం నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కాబోతుంది. బాక్సింగ్ డే సందర్భంగా సెంచూరియన్ వేదికగా ఇరు జట్లు తొలి టెస్ట్‌లో తలపడబోతున్నాయి. గాయం కారణంగా ఓపెనర్ రోహిత్ శర్మ టెస్ట్ సిరీస్‌కు దూరం కావడంతో అతని ప్లేసులో మయాంక్ అగర్వాల్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు.