
హైదరాబాద్: సొంతగడ్డపై పాకిస్థాన్‌తో జరిగిన ఐదు వన్డేల సిరీస్‌ను ఆతిథ్య దక్షిణాఫ్రికా3-2తో కైవసం చేసుకొంది. బుధవారం జరిగిన ఐదో వన్డేలో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో పాక్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ను సఫారీ బౌలర్లు తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.
దీంతో నిర్ణీత 50 ఓవర్లలో పర్యాటక జట్టు 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. పాకిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో ఫఖర్ జమాన్ హాఫ్ సెంచరీ (70; 73 బంతుల్లో 10 ఫోర్లు)తో రాణించగా ఇమాద్ వసీం (47 నాటౌట్; 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులు) సత్తా చాటాడు. సఫారీ బౌలర్లలో పిస్టోరియస్ (2/46), పెలుక్వాయో (2/42) రాణించారు.
అనంతరం 241 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఓపెనర్లు ఆమ్లా (14), హెండ్రిక్స్ (34) తక్కువ స్కోర్లకే వెనుదిరిగినా డికాక్ (83; 58 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సులు), డుప్లెసిస్ (50 నాటౌట్; 72 బంతుల్లో 3 ఫోర్లు), వాండర్ డుసెన్ (50 నాటౌట్; 61 బంతుల్లో 3 సిక్సులు) రాణించడంతో 40 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
అంతకముందు టెస్టు సిరీస్‌ను కూడా దక్షిణాఫ్రికానే విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో తొలి మ్యాచ్ శుక్రవారం జరగనుంది.