హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ తన డ్రీమ్ ఐపీఎల్ జట్టుని ప్రకటించాడు. టీ20కి ఫార్మెట్‌కు ధోని పనికిరాడన్న చెప్పిన దాదా అదే మాటను నిజం చేశాడు. తాను ఎంపిక చేసిన డ్రీమ్ ఐపీఎల్ జట్టులో మహేంద్ర సింగ్ ధోనికి గంగూలీ చోటు కల్పించలేదు.
ధోని స్థానంలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు అవకాశం కల్పించాడు. ఇక టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్‌గా పేరొందిన సురేశ్ రైనాకు కూడా గంగూలీ చోటు కల్పించలేదు. ధోని టీ20ల్లో ఏమంత గొప్పగా ఆడట్లేదని ఇటీవలే సౌరభ్ గంగూలీ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే.

'ధోని వన్డే ఫార్మాట్‌లో ఛాంపియన్ ప్లేయర్. కానీ టీ20ల్లో ఇప్పుడు కూడా అలాంటి ప్రదర్శనే చేయగలడని నేనైతే అనుకోవడం లేదు. 10 ఏళ్ల టీ20 కెరీర్‌లో అతడు సాధించింది ఒక్క అర్ధ సెంచరీ మాత్రమే' అని గంగూలీ అన్న విషయం తెలిసిందే. ఇక గంగూలీ ప్రకటించిన ఐపీఎల్ డ్రీమ్ టీమ్‌లో నలుగురు విదేశీ ఆటగాళ్లకు చోటు లభించింది.
రైజింగ్ పూణె సూపర్ జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నుంచి ఏబీ డివిలియర్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి సునీల్ నరేన్, ఢిల్లీ జట్టు నుంచి క్రిస్ మోరిస్‌లకు చోటు కల్పించాడు. ఓపెనర్లుగా కెప్టెన్లు విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్‌లను గంగూలీ ఎంచుకున్నాడు.
'ఎంతో ఆలోచించి, కీలక మార్పుల ద్వారా తన ఐపీఎల్ ఫాంటసీ డ్రీమ్ టీమ్‌ను ప్రకటిస్తున్నా' అని గంగూలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. రెండో స్ధానాన్ని ఏబీ డివిలియిర్స్‌కు కేటాయించగా, పూణె కెప్టెన్ స్టీవ్ స్మిత్‌కు మూడో స్ధానాన్ని సూచించాడు. గంగూలీ ఎంపిక చేసిన జట్టులో ఉన్న ఆటగాళ్లు వీరే.
గంగూలీ ఐపీఎల్ డ్రీమ్ టీమ్: విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్, డివిలియర్స్, స్టీవ్ స్మిత్, నితీష్ రానా, మనీష్ పాండే, రిషబ్ పంత్, సునీల్ నరైన్, క్రిస్ మోరిస్, అమిత్ మిశ్రా, భువనేశ్వర్ కుమార్