కెప్టెన్ రోహిత్ శర్మపై భారత మాజీ క్రికెటర్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టెస్ట్ క్రికెట్ లో అతడి ప్రదర్శన అంతగా బాగోలేదని, దానిపై హిట్‌మ్యాన్ చాలా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పాడు. అలానే టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ప్రదర్శన కూడా అసంతృప్తికరంగా ఉందని అన్నాడు. ఇంగ్లాండ్ తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్ లో భారత జట్టు గొప్పగా రాణించాలంటే, రోహిత్ శర్మ ఫామ్ కీలకంగా మారనుందని అభిప్రాయపడ్డాడు.
రోహిత్ అలా చేయాలి...
"గత నాలుగైదేళ్లుగా రెడ్ బాల్ క్రికెట్ లో రోహిత్ శర్మ ఫామ్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అతడు ఇప్పటివరకు ఏం చేశాడో.. అంతకన్నా ఎక్కువగా, బాగా ఆడగల సామర్థ్యం ఉంది. రోహిత్ ఈ విషయంపై బాగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంగ్లాండ్‌తో ఆడబోయే ఐదు టెస్టు మ్యాచులు కీలకం. ఆస్ట్రేలియాలో ఎదురైన కఠిన పరిస్థితులే ఇంగ్లాండ్‌లో కూడా ఎదురౌతాయి. కాబట్టి అతడు టెస్టుల్లో రాణించడం టీమిండియాకు అవసరం. వన్డే క్రికెట్‌లో ఎలాగో అతడు అద్భుతమైన ప్లేయర్." అని గంగూలీ పేర్కొన్నాడు.

అది చాలా ముఖ్యం..
"నాయకత్వం అనేది చాలా ముఖ్యం. రోహిత్ శర్మ అద్భుతమైన కెప్టెన్. ఎందుకంటే అతడు టీమిండియాకు, ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్ గా వ్యవహరించినప్పుడు నేను కొన్ని విషయాలను నోటీస్ చేశాను. పైగా నేను చాలా మ్యాచ్‌లకు భారత జట్టుకు నాయకత్వం వహించాను. అందుకే ఓ కెప్టెన్‌లోని లక్షణాలను నేను గమనించగలను. వైట్‌బాల్ క్రికెట్‌లో అతడు సాధించిన ఘనతలు చూసి నేను ఆశ్చర్యపోలేదు. మరి టెస్టు క్రికెట్‌లో కూడా అతడు ఇలానే రాణిస్తాడా లేడా అనేది తెలీదు. కానీ అతడు నా మాటలు వింటుంటే.. టెస్టుల్లో జరుగుతోన్న పరిణామాలకు అతడు బాధ్యత తీసుకోవాలి. ఇంగ్లాండ్‌లో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్‌లో బాగా రాణించేందుకు మార్గాన్ని అన్వేషించాలి. ఎందుకంటే ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. అలాగే టెస్టుల్లో టీమిండియా బాగా రాణించాలంటే, రోహిత్ బాగా రాణించాలి." అని గంగూలీ చెప్పుకొచ్చాడు.
కాగా, గత ఐదు నెలల్లో టీమిండియా... బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాతో 10 టెస్టు మ్యాచులు ఆడగా.. అందులో మూడు మాత్రమే గెలిచింది. బంగ్లాదేశ్‌ను 2-0తో ఓడించిన భారత జట్టు.. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. అలానే బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ తప్ప.. అన్నింట్లో ఓడిండి. 1-3తో తేడాతో ట్రోఫీని కోల్పోయింది. ఇక జూన్‌లో ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.