
లండన్: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో వర్షం వల్ల మ్యాచ్‌లు మొత్తంగా రద్దు చేయడం పట్ల టీమిండియా మాజీ కేప్టెన్ సౌరభ్ గంగూలి అసహనాన్ని వ్యక్తం చేశారు. నాలుగేళ్లకోసారి జరిగే ఈ మెగా టోర్నమెంట్‌లో వర్షం వల్ల మ్యాచ్‌లు రద్దు కావడం సహేతుకం కాదని అన్నారు. వర్షం పడినప్పటికీ.. మ్యాచ్‌లను కొనసాగించేలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒక్క వర్షానికే మ్యాచ్ మొత్తం రద్దయిపోతే.. ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురవుతారని, వాన గండం నుంచి గట్టెక్కడానికి నిర్దుష్టమైన ప్రణాళికలు ఉండాల్సిందేనని అన్నారు.
ఇంగ్లండ్ కవర్లు.. ఈడెన్‌లో!
కోల్‌కతలోని ప్రతిష్ఠాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా వర్షం పడితే..అవుట్ ఫీల్డ్ మొత్తాన్నీ కవర్లతో కప్పేస్తామని సౌరభ్ గంగూలి తెలిపారు. దీనికోసం అవసరమైన కవర్లను తాము ఇంగ్లండ్ నుంచే కొనుగోలు చేస్తామని అన్నారు. ఖరీదు ఎక్కువే అయినప్పటికీ.. ఆ కవర్లు భలేగా పనిచేస్తాయని కితాబిచ్చాడు. వర్షం వెలిసిన పది నిమిషాల్లోనే తేమను పీల్చేస్తాయని, మైదానం మొత్తంలో తడి లేకుండా చేస్తాయని చెప్పారు. ఎక్కడో ఇంగ్లండ్ నుంచి తాము కోల్‌కతకు కవర్లను తెప్పించుకుంటుంటే.. అదే ఇంగ్లండ్‌లో జరిగే మ్యాచ్‌ల కోసం వాటినే ఎందుకు వినియోగించరని ప్రశ్నించారాయన.
ఇక్కడి కవర్లనే కొనుగోలు చేస్తే..
ఇంగ్లండ్‌లో తయారయ్యే నాణ్యమైన కవర్లను ఇంగ్లండ్‌లోనే వినియోగించడం వల్ల రవాణా ఖర్చులు మిగులుతాయని, పన్నులు కట్టాల్సిన పనీ ఉండబోదని గంగూలీ సూచించారు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నమెంట్లలో పిచ్‌ను మాత్రమే కప్పేయడం వల్ల ఉపయోగం లేదని అన్నారు. అవుట్ ఫీల్డ్ మొత్తాన్నీ కవర్లతో కప్పి వేస్తే, వాన వెలిసిన తరువాత మ్యాచ్‌లను కొనసాగించడానికి వీలు ఉంటుందని సలహా ఇచ్చారు.
ప్రపంచకప్‌లో ఇంకా ఎన్నో మ్యాచ్‌లను ఆడాల్సి ఉందని, మెజారిటీ మ్యాచ్‌లను వర్షం వెంటాడే అవకాశాలూ లేకపోలేదని అన్నారు. ఇప్పటికైనా సరే! స్థానికంగా తయారయ్యే నాణ్యమైన కవర్లను తెప్పించుకుని గ్రౌండ్ మొత్తాన్నీ కవర్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇలాంటి మ్యాచ్‌ల నిర్వహణ విషయం కాస్త ఖర్చు ఎక్కువైనా భరించక తప్పదని, కక్కుర్తి పడటం సరికాదని చెప్పుకొచ్చారు.