ద్రవిడ్ కెరీర్‌ను కాపాడింది నేనే.. లేదంటే అప్పుడే ఖతమైపోయేది: మాజీ కెప్టెన్
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ ఒకరు. మాజీ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ వన్డే కెరీర్‌కు సంబంధించి గంగూలీ ఓ సంచలవ విషయాన్ని వెల్లడించాడు. ఒకానొక సమయంలో వన్డే క్రికెట్లో ద్రవిడ్ స్థానంపై తీవ్ర విమర్శలు వచ్చాయని.. సెలెక్టర్లు కూడా అతడిని జట్టు నుంచి తొలగించాలని భావించారని గంగూలీ పేర్కొన్నాడు. అయితే ఆ క్లిష్ట సమయంలో తాను ద్రవిడ్ కు అండగా నిలబడ్డానని.. సెలెక్టర్లతో పాటు స్వయంగా బీసీసీఐ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లానని దాదా చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ద్రవిడ్‌ను భారత క్రికెట్ చరిత్రలోనే గొప్ప బ్యాటర్లలో ఒకడిగా కొనియాడుతున్నప్పటికీ.. ఆ రోజు తాను గనుక మద్దతు ఇవ్వకపోయి ఉంటే ద్రవిడ్ వన్డే కెరీర్ అక్కడితోనే ముగిసిపోయేదని గంగూలీ పేర్కొన్నాడు.
రాజ్ షమాని పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న సౌరవ్ గంగూలీ ఆనాటి రోజులను గుర్తు చేసుకుంటూ .. "వన్డే క్రికెట్‌కు సరిపోయేలా రాహుల్ ద్రవిడ్ స్ట్రైక్ రేట్ లేదని ఆ రోజుల్లో చాలామంది విమర్శించేవారు. సెలెక్టర్లు కూడా ద్రవిడ్ స్థానంలో వేరే ఇతర ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలని గట్టిగా భావించారు. కానీ నేను మాత్రం ద్రవిడ్‌ను వదులుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. ఒకవేళ ఆ సమయంలో నేను కూడా సెలెక్టర్ల మాటే విని ఉంటే, బహుశా ద్రవిడ్ కెరీర్ అక్కడితోనే ముగిసిపోయేది" అని గంగూలీ తన సంచలన విషయాలను వెల్లడించాడు. 2000 ఏడాది ప్రారంభంలో భారత వన్డే జట్టును కాపాడుకోవడానికి గంగూలీ తీసుకున్న ఓ వ్యూహాత్మక నిర్ణయం భారత క్రికెట్ రూపురేఖలనే మార్చేసింది.

ఆ సమయంలో ప్రపంచ క్రికెట్లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, మార్క్ బౌచర్, కుమార్ సంగక్కర వంటి ఆటగాళ్లు తమ జట్లలో వికెట్ కీపర్లుగా ఉండటమే కాకుండా అద్భుతమైన బ్యాటింగ్‌తో జట్లకు అదనపు బలాన్ని చేకూర్చేవారు. కానీ భారత జట్టులో మాత్రం లోయర్ ఆర్డర్ లో భారీగా పరుగులు చేయగల సరైన వికెట్ కీపర్ బ్యాటర్ కొరత ఉండేది. ఆ సమస్యకు పరిష్కారంగా జట్టు యాజమాన్యం ఓ ప్రయోగానికి తెరలేపింది. అప్పటివరకు కేవలం స్పెషలిస్ట్ బ్యాటర్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ కు వికెట్ కీపింగ్ బాధ్యతలను అప్పగించాలని కెప్టెన్ సౌరవ్ గంగూలీ నిర్ణయించాడు.
ఈ ప్రయోగం వెనుక ఉన్న అసలు కారణాన్ని గంగూలీ వివరిస్తూ.. "జట్టులో కీపింగ్‌తో పాటు బ్యాటింగ్ చేయగల సమర్థుడైన ప్లేయర్ లేడు. అందుకే ద్రవిడ్‌ను వికెట్ కీపర్‌గా మార్చాలని నిర్ణయించాం. దీనివల్ల జట్టులో మరొక అదనపు బ్యాటర్‌ను ఆడించే అవకాశం మాకు దక్కింది" అని గంగూలీ చెప్పుకొచ్చాడు. ఈ కీలక నిర్ణయం వల్ల టీమిండియా మిడిలార్డర్ మరింత బలోపేతం కావడమే కాకుండా, మహ్మద్ కైఫ్ వంటి యువ ఆటగాళ్లకు తుది జట్టులో చోటు లభించింది. ద్రవిడ్‌ను కీపర్‌గా మార్చిన ఈ వ్యూహం తాత్కాలికంగా కాకుండా, 2003 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్ చేరడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది.
అంతేకాకుండా ఆనాటి రోజుల్లో భారత జట్టులో బలమైన ఆల్‌రౌండర్లు లేకపోవడం కూడా ఓ పెద్ద లోపమని గంగూలీ అంగీకరించాడు. కీపర్‌గా ద్రవిడ్ అదనపు బ్యాటర్‌కు స్థానం కల్పించినప్పటికీ, బౌలింగ్ విభాగంలో లోటును భర్తీ చేయడానికి తాను, వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్‌లు పార్ట్-టైమ్ బౌలర్లుగా మారాల్సి వచ్చిందని గంగూలీ పేర్కొన్నాడు. ప్రస్తుతం గంగూలీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల మధ్య సరికొత్త చర్చకు దారితీశాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications