
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ షెడ్యూల్ త్వరలోనే రానుంది. ఐపీఎల్ 2021 షెడ్యూల్‌పై బీసీసీఐ పనిచేస్తోందని బోర్డు అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తెలిపారు. ఓ జాతీయ మీడియాతో సోమవారం దాదా మాట్లాడుతూ.. బీసీసీఐ ప్రస్తుతం ఐపీఎల్ 2021 షెడ్యూల్‌పై కసరత్తులు చేస్తోందని, త్వరలోనే అధికారిక షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదాపడ్డ ఐపీఎల్ 2021.. సెప్టెంబర్-అక్టోబర్లో యూఏఈ వేదికగా జరగనున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు టోర్నీ జరగనుందని సమాచారం.
2022 నుంచి పది జట్లతో ఐపీఎల్‌ను జరపాలని బీసీసీఐ భావిస్తోన్న విషయం తెలిసిందే. నిజానికి 2021లో రెండు జట్లను అదనంగా చేర్చబోతున్నట్టు జోరుగా వార్తలు వచ్చాయి. అయితే హడావిడిగా కొత్త జట్లను చేర్చే ప్రయత్నాలను ప్రస్తుత ఫ్రాంచైజీలు వ్యతిరేకించాయి. మరో రెండు జట్లని టోర్నీలోకి ఆహ్వానిస్తే.. అప్పుడు ఆటగాళ్ల కోసం మెగా వేలం తప్పనిసరి. అంతేకాదు బ్రాడ్‌కాస్టర్ హక్కులు, స్ఫాన్సర్‌షిప్‌కి సంబంధించిన ఒప్పందాలని కూడా సవరించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి 8 జట్లతోనే టోర్నీ నిర్వహించారు.
అయితే ఐపీఎల్ 2021 రెండవ దశకు ముందే రెండు కొత్త జట్ల అమ్మకాలను పూర్తి చేయాలని బీసీసీఐ యోచిస్తోందట. ఇందుకోసం టెండర్లను ఆహ్వానించనుంది. జూలైలోనే మొత్తం ప్రక్రియ పూర్తవనుందని సమాచారం. కొత్త జట్లను కొనుగోలు చేసేందుకు పలు కార్పొరేట్ కంపెనీలు ఉత్సాహం చూపుతున్నాయని సమాచారం. ముఖ్యంగా గుజరాత్ నుంచి పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీ కొనుగోలుపై ఆసక్తిగా ఉన్నారట. అలాగే అతనికి ఆర్‌పీఎస్‌జీ కంపెనీ చైర్మన్ సంజీవ్ గోయెంకా గట్టి పోటీ ఇస్తున్నారు. గతంలో రెండేళ్ల పాటు రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ పేరిట ఫ్రాంచైజీని నిర్వహించిన అనుభవం గోయెంకాకు ఉంది. ఇక హీరో మోహన్ లాల్ కూడా కొత్త జట్టుపై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2021పై కూడా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మెగా టోర్నీని యూఏఈకి తరలిస్తున్నామని సోమవారం ప్రకటించింది. కరోనా వైరస్ ముప్పు, ఆరోగ్యం, సంక్షేమ కారణాల రీత్యా టీ20 ప్రపంచకప్ వేదికను మార్పు చేయక తప్పడం లేదని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించారు. 'టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి తలిస్తామని మేం ఐసీసీకి అధికారికంగా తెలియజేశాం. త్వరలోనే వివరాలు వెల్లడిస్తాం' అని దాదా తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో టోర్నీ జరగనున్న సంగతి తెలిసిందే.