
కలకత్తా: చారిత్రాత్మక మైదానమైన ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే టెస్టును వీక్షించాల్సిందింగా క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పంపిన ఆహ్వానాన్ని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అంగీకరించారు. ఈ విషయాన్ని గంగూలీనే ఓ ఇంటర్వ్యూ ద్వారా తెలిపాడు. ఈ టెస్ట్ మ్యాచ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా హాజరవుతున్నారని సమాచారం తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రధాని వస్తున్నారు కాబట్టి మోడీ, మమతా కూడా రానున్నారు.
తాజాగా గంగూలీ మాట్లాడుతూ... 'బంగ్లాదేశ్ ఆటగాళ్లు భారత సిరీస్‌కు రావడం ఖాయం. బంగ్లా ప్రధాని షేక్ హసీనా ఈడెన్ గార్డెన్‌లో గంట మోగించి రెండో టెస్టు మ్యాచ్‌ను ప్రారంభిస్తారు. ఈ మ్యాచ్‌కి భారత ప్రధాని మోడీ, సీఎం మమతా బెనర్జీలకు కూడా ఆహ్వానం పంపించాం. వారు కూడా హాజరవుతారు' అని గంగూలీ తెలిపాడు. బంగ్లా ప్రధాని గంగూలీ ఆహ్వానాన్ని అంగీకరించినా.. మోడీ, మమతాలు కచ్చితంగా వస్తున్నట్లు సమాచారం మాత్రం తెలియరాలేదు.
భారత్-బంగ్లాదేశ్‌ల జట్ల మధ్య వచ్చే నెల నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టుకు కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యమివ్వనుంది. ఈ రెండు జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో తలపడటం ఇదే తొలిసారి. బంగ్లాదేశ్‌కు తొలి టెస్టు కావడంతో.. ఈ టెస్టును వీక్షించాల్సిందింగా భారత, బంగ్లా ప్రధానులకు క్యాబ్ నుండి ఆహ్వానం అందింది.
గంగూలీ క్యాబ్ అధ్యక్షుడు అయ్యాక వినూత్న ఆలోచనలతో ముందుకు వెళుతున్నాడు. లార్డ్స్ మాదిరిగా ఈడెన్‌లోను గంట కొట్టి మ్యాచ్ ప్రారంభించే ఆనవాయితీని గంగూలీ ప్రవేశపెట్టాడు. 2016లో టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కు బాలీవుడ్ 'బిగ్‌బీ' అమితాబ్ బచ్చన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి జాతీయ గీతం పాడించారు. ఇప్పుడు ఏకంగా ఇద్దరు ప్రధానులను ఆహ్వానించారు.
భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య 3 టీ-20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. నవంబర్ 3న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మొదటి టీ20 మ్యాచ్‌తో సిరీస్ ఆరంభమవుతుంది. టెస్ట్ సిరీస్ అనంతరం నవంబర్ 22 నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రెండో టెస్టు ప్రారంభం కానుంది.