ఢిల్లీ: తన వీడ్కోలు సందేశంలో వీరేంద్ర సెహ్వాగ్ ఓ మాట చెప్పాడు. కెరీర్లో తనకు ఎన్నో సలహాలు ఇచ్చిన వాళ్లందరికీ ధన్యవాదాలు అని, కానీ వాటిలో చాలా వరకు పాటించలేదని అందుకు మన్నించాలని సెహ్వాగ్ చెప్పాడు. అందుకు ఓ కారణం ఉందని తెలిపాడు.
నా ఆట నేను ఆడుతానని, అంతేనని చెప్పాడు. ప్రతి బంతికీ ఫోర్ కొట్టాలనే అనుకుంటానని, ఒకప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తన ఆలోచన అదేనని సెహ్వాగ్ గతంలోను చెప్పాడు. అయితే, తనకు ఆట విషయంలో సలహాలు ఇచ్చిన వారి మాట పాటించనందుకు క్షమాపణలు కోరుతూ అందుకు కారణం చెప్పాడు.
సచిన్, ద్రావిడ్, గంగూలీ, ధోనీ, కుంబ్లే, లక్ష్మణ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి వారితో ఆడటం తన అదృష్టమని సెహ్వాగ్ చెప్పాడు వారు ఆడే తీరు నుంచి, వాటి ఆటకు సన్నద్ధమయ్యే తీరు నుంచి చాలా తెలుసుకున్నానని చెప్పాడు.య అది తనకు గొప్ప గౌరవం అన్నాడు.

తన కోసం సౌరవ్ గంగూలీ ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడని చెప్పాడు. తనను గంగూలీ ఎంతో అభిమానించాడని చెప్పాడు. తన పైన నమ్మకం ఉంచాడని, అందుకు కృతజ్ఞతలు అన్నాడు. అతను తనలోని టెస్ట్ ఆటగాడిని చూశాడని, టెస్టులు ఆడి ఉండకపోతే ఇన్ని పరుగులు చేసేవాడిని కాదన్నాడు.
తన తొలి ట్రిపుల్ సెంచరీ, 2011 ప్రపంచ కప్ విజయం, శ్రీలంక పైన డబుల్ సెంచరీ తనకు మధుర స్మృతులు అని చటెప్పాడు. కానీ తనకు అత్యంత చిరస్మరణీయం మాత్రం తన టెస్ట్ ఆరంగేట్రమే అన్నాడు. దానికన్నా ముందు తనను వన్డే ఆటగాడిగానే పరిగణించేవారన్నాడు.
తన శైలి వన్డేలకు మాత్రం సరిపోతుందని చెప్పేవారని, కానీ తన తొలి టెస్ట్ శతకం తర్వాత నేను కూడా టెస్టులు ఆడగలనని జనం నమ్మారని చెప్పాడు. కాబట్టి నా టెస్టు ఆరంగేట్రమే తనకు అన్నింటికన్నా బాగా గుర్తుండి పోతుందని చెప్పాడు.