న్యూఢిల్లీ: శనివారం ఢిల్లీ, బెంగాల్ రంజీ మ్యాచ్‌లో గంభీర్, మనోజ్ తివారీలు తాము గొడవ పడడమే కాకుండా దాంట్లోకి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం(క్యాబ్) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని లాగారు. గొడవ సందర్భంగా గంగూలీతో పాటు బెంగాల్ జాతిని కించపరుస్తూ గంభీర్ వివాదస్పద వ్యాఖ్యలు చేశాడని ఆదివారం తివారి మీడియాతో అన్నాడు.
తమ ఇద్దరి మధ్య చోటుచేసుకున్న గొడవలో గంగూలీ ప్రస్తావన కూడా వచ్చిందని, దీంతో తాను చాలా కలత చెందానని, జట్టుగా తామంతా బెంగాల్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నప్పుడు ఇలాంటి జాతి వివక్ష వ్యాఖ్యలను సహించదల్చుకోలేదని మనోజ్ తివారీ అన్నాడు. ఆటగాళ్ల మధ్య స్లెడ్జింగ్ అనేది మంచిదే గానీ ఎంత వరకు ఉండాలి, పరిధి దాటకుండా ఎలా వ్యవహరించాలన్నది తెలిసి ఉండాలని అన్నారు.

ఆ వివాదంపై గంగూలీతో మాట్లాడానని తివారీ అన్నాడు. అయితే ఈ వివాదంపై మీడియాతో ఎక్కువగా వ్యాఖ్యానించవద్దని మ్యాచ్ రిఫరీ చెప్పిన నేపథ్యంలో తివారి మరిన్ని విషయాలు వెల్లడించడానికి నిరాకరించాడు. ఈ గొడవకు సంబంధించి పూర్తి వీడియో ఫుటెజీ బీసీసీఐకి వెళ్లిందన్న తివారి బోర్డు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూస్తానని అన్నాడు.
కాగా, తాను గంగూలీతో పాటు బెంగాల్ జాతిని కించపరిచేలా వ్యాఖ్యానించినట్లు తివారీ చేసిన ఆరోపణలను గంభీర్ ఖండించాడు. తనకు ఫేవరెట్ క్రికెటర్లలో గంగూలీ ఒకరని, దాదా అని మేమంతా ప్రేమగా పిలుచుకునే గంగూలీ సారథ్యంలో ఎన్నో మ్యాచ్‌లు ఆడానని చెప్పాడు.
బెంగాల్ తనకు రెండో ఇల్లులాంటిదని ఎన్నో ఇంటర్వ్యూల్లో చెప్పానని, బెంగాల్ ప్రజలంటే తనకెంతో గౌరవం ఉందని అన్నాడు. దాదాను, బెంగాల్ జాతిని అవమానించేలా తాను వ్యాఖ్యలు చేసినట్లు తివారీ ఆరోపించడం అబద్ధమని అన్నాడు. ఏదో సంచలనం కోసం తివారి ఇలాంటి ఆరోపణలు చేస్తున్నాడని గంభీర్ అన్నాడు.