
ఐసీసీలో భారత్ స్థానం
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ)కి అత్యధిక ఆదాయం భారత్ నుంచే వస్తుంది. ఆదాయంలో మాత్రమే కాదు క్రికెట్ ఎక్కువ ఆదరణ పొందిన దేశాల్లో భారత్ ఒకటి. నిన్నా మొన్నటి వరకు బీసీసీఐ ఏం చెప్తే ఐసీసీ దాన్నే అమలు చేసేది. అయితే, ఐసీసీలోకి శశాంక్ మనోహార్ వచ్చాక పరిస్థితి మారింది. బీసీసీఐని ఐసీసీ గౌరవించట్లేదు. ఐసీసీకి ముఖ్య ఆదాయవనరుగా ఉన్న బీసీసీఐ అందుకు ప్రతిఫలంగా తిరిగి లబ్ధి పొందలేకపోతోంది. బిగ్ త్రీ మోడల్ (ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, భారత్)ను ఐసీసీ రద్దు చేయడంతో భారత్ 570 మిలియన్ డాలర్ల ఆదాయం కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని గంగూలీ ఏ విధంగా టాకిల్ చేస్తాడనేది ప్రధాన అంశంగా మారింది.

పన్నుమినహాయింపులు
సొంతగడ్డపై జరిగిన 2016 టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పన్నురాయితీ అంశంపై ఐసీసీతో సఖ్యత లోపించింది. అసలేం జరిగిందంటే.. ఐసీసీ నిర్వహించే కార్యక్రమాలకు బ్రాడ్‌కాస్టర్లు దిగుమతి చేసుకునే అన్ని రకాల పరికరాలకు భారత ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వాలని ఐసీసీ కోరుతోంది. నిజానికి పన్ను మినహాయింపు అనేది కేంద్రం పరిధిలోని అంశం. పన్నులు కట్టాల్సి వస్తే ఆ మొత్తాన్ని బీసీసీఐ ఆదాయం నుంచి ఆ మొత్తాన్ని కోతగా విధిస్తామని ఐసీసీ చెబుతోంది. ఐసీసీ నుంచి ఈ కోతను తప్పించుకోవాలంటే స్టార్ స్పోర్ట్స్ ఈ మొత్తాన్ని భరించేలా బీసీసీఐ ఒప్పించాలి. మరోవైపు 2021 టీ20 ప్రపంచకప్, 2023 వన్డే ప్రపంచకప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిపై గంగూలీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది.

దేశవాళీ ఆటగాళ్లకు దినసరి భత్యాల పెంపు
దేశవాళీ ఆటగాళ్లకు దినసరి భత్యాల పెంపు ఎప్పటి నుంచో వినిపిస్తోంది. ప్రస్తుతం ఓ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే ఆటగాడికి రూ. 1.4 లక్షలు ఇస్తున్నారు. నిజానికి అంతర్జాతీయ స్థాయితో పోల్చితే ఇది చాలా తక్కువ. అంతర్జాతీయ ఆటగాళ్లకు రూ.కోటి నుంచి ఏడు కోట్ల వరకు అందుతోంది. దీంతో ఈ మొత్తాన్ని రూ. 2.5 లక్షలకు పెంచాలని ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మ్యాచ్ ఫీజుని రెట్టింపు చేయాలనే ఆలోచనలో కూడా దాదా ఉన్నాడు. ఇది గనుక జరిగితే దేళవాళీ ఆటగాళ్ల మ్యాచ్ ఫీజు రూ. 2.5 లక్షల వరకు పెరగనుంది.

దేశవాళీ క్రికెట్‌పై ప్రత్యేక దృష్టి
దేశవాళీ క్రికెట్‌లో ప్రమాణాలు పెంచడంతో పాటు లోపాలను సరిచేయడంపై దృష్టి సారించాడు. ఇందులో ముఖ్యమైనది పరిమిత ఓవర్ల టోర్నీల సంఖ్యను పెంచడం. ముఖ్యంగా అంపైర్ల నియామక పరీక్షలను అప్‌గ్రేడ్ చేయడం. అంపైర్ తీసుకునే నిర్ణయాల్లో ఘోర తప్పిదాల కారణంగా మ్యాచ్ ఫలితాలే తారుమారయ్యే పరిస్థితి.

డే అండ్ నైట్ టెస్టులు
2016లో దులీప్ ట్రోఫీ సందర్భంగా గులాబీ బంతితో ప్రయోగం చేసినా.. అది పెద్దగా ఫలితాన్నివ్వలేకపోయింది. పింక్ బంతి నాణ్యత అంతగా లేదని బౌలర్లు ఫిర్యాదు చేయడంతో పాటు... సాయంత్రం వేళల్లో వెలుతురు తగ్గి బంతిని చూడటం కష్టంగా ఉందని బ్యాట్స్‌మెన్ ఫిర్యాదు చేశారు. దీంతో డే అండ్ నైట్ టోర్నమెంట్‌కు తెరపడింది. 2018-19 బోర్డర్-గవాస్కర్ సిరిస్‌లో భాగంగా ఈ ఏడాది జనవరిలో అడిలైడ్ వేదికగా డే-నైట్ టెస్టు మ్యాచ్ నిర్వహించాలని ఆస్ట్రేలియా బోర్డు ప్రయత్నాలు చేసినప్పటికీ బీసీసీఐ మాత్రం అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు దాదా డే అండ్ నైట్ క్రికెట్‌ను ఆడించేలా దాదా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. టెస్టు క్రికెట్‌ను బ్రతికించుకునేందుకు ఇదొక మార్గమని దాదా ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.

విరుద్ధ ప్రయోజనాల అంశం
ప్రస్తుతం భారత క్రికెట్‌లో అతిపెద్ద సమస్యగా మారిన అంశం ఇది. దీనివల్ల అత్యుత్తమ క్రికెటర్ల సేవలను బీసీసీఐ ఉపయోగించుకోవడం కష్టంగా మారింది. గతంలో విరుద్ధ ప్రయోజనాల అంశం పేరిట క్రికెట్ సలహా కమిటీలో సభ్యులుగా ఉన్న సచిన్, గంగూలీ, లక్ష్మణ్‌కు అంబుడ్స్‌మన్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరితో పాటు రాహుల్ ద్రవిడ్, కపిల్ దేవ్‌కు ఈ అంశం సెగ తగిలింది. దీంతో ఈ అంశంపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. తొమ్మిది నెలలు పదవిలో ఉండే గంగూలీ ఈ సమస్యల్లో ఎన్నింటిని సరిదిద్దుతాడో చూడాలి మరి.


Click it and Unblock the Notifications












