
ముంబై: మాజీ కెప్టెన్ 'బీసీసీఐ అధ్యక్షుడు' సౌరవ్ గంగూలీ, మాజీ లెజెండరీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ 1996 నుండి 2007 వరకు భారత జట్టుకు అనేక విజయాలు అందించారు. గంగూలీ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేయగా.. లక్ష్మణ్ టెస్టుల్లో క్లాస్ ఆటతో అలరించాడు. మాజీ దిగ్గజాలు రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్‌లతో కలిసి ఎన్నో రికార్డులలో నిలిచారు. అయితే గంగూలీ, లక్ష్మణ్‌లలో ఒక్కరినే ఎంపిక చేయాల్సి వస్తే.. ఎవరిని ఎంపిక చేసుకుంటారని ఐసీసీ ట్విటర్ వేదికగా అభిమానులకు ఓ ప్రశ్న వేసింది.
'గంగూలీ, లక్ష్మణ్‌లు టీమిండియా కోసం 29,606 పరుగులు, 61 శతకాలు సాధించారు. ఈ ఇద్దరిలో ఒక్కరినే ఎంపిక చేయాలనుకుంటే..మీ ఓటు ఎవరికి' అని ఐసీసీ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. చాలా మంది భారత అభిమానులు ఐసీసీపై మండిపడుతున్నారు. 'ఇద్దరూ భారత క్రికెట్‌లో లెజెండరీ ఆటగాళ్లే' అని ఓ అభిమాని ట్వీట్ చేసాడు. 'ఇదొక చెత్త ప్రశ్న', 'ఎంచుకోవడం చాలా కష్టం' అంటూ మరికొందరు స్పందించారు. 'కెప్టెన్సీ పరంగా దాదా తనదైన ముద్ర వేస్తే.. క్లాసిక్ బ్యాటింగ్‌తో లక్ష్మణ్ ఆకట్టుకున్నాడు' అని అభిమానులు కామెంట్లు రాస్తున్నారు.
ఇటీవలే బీసీసీఐ అధ్యక్షుడిగా ఎంపికైన గంగూలీని క్రికెట్ అసోషియేషన్ ఆఫ్ బెంగాల్ (క్యాబ్) సన్మానించిన కార్యక్రమానికి హాజరైన లక్ష్మణ్ తన గత అనుభవాల్ని పంచుకున్నారు. 2014లో క్యాబ్ జాయింట్ సెక్రటరీగా గంగూలీ పనిచేస్తున్న సమయంలో లక్ష్మణ్ బెంగాల్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్‌గా పనిచేసాడు. ఈ సమయంలో గంగూలీని కలవడానికి వెళ్లిన లక్ష్మణ్‌కు ఊహించని పరిణామం ఎదురైందట. క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగి, భారత క్రికెట్‌ను ఒక ఉన్నత స్థాయిలో నిలిపిన కెప్టెనే కాకుండా, వరల్డ్ క్రికెట్‌లో లెజెండ్ అయినటువంటి గంగూలీని ఆ రూమ్‌లో చూసి లక్ష్మణ్ షాక్ అయ్యారట.
'బెంగాల్ బ్యాటింగ్ కన్సల‍్టెంట్‌గా ఉన్న సమయంలో గంగూలీని కలవడానికి వెళ్లా. ఆ సమయంలో రాష్ట్ర అసోసియేషన్‌లోని ఒక చిన్న గదిలో గంగూలీ కూర్చొని ఉన్నాడు. ఆ రూమ్ నన్ను షాక్‌కు గురి చేసింది. అది చాలా చిన్న రూమ్. అందులో గంగూలీ సేవలందిస్తున్నాడు. ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యా. కానీ.. అది నాలో స్ఫూర్తిని నింపింది' అని లక్ష్మణ్ తెలిపారు. అనంతరం గంగూలీ మాట్లాడుతూ లక్ష్మణ్ బ్యాటింగ్‌ను కొనియాడాడు. ఈ కార్యక్రమానికి లక్ష్మణ్‌తో పాటు అజహరుద్దీన్ కూడా హాజరయ్యారు.