
హైదరాబాద్: భారత జట్టు చూసిన అత్యుత్తమ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్లలో డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒకడు. తొలి బంతినే సిక్సర్‌గా లేదా ఫోర్‌గా మలచిన సందర్భాలు అనేకం. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సెహ్వాగ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను నాలుగో నెంబర్ స్థానంలో ప్రారంభించడం.. అవును సెహ్వాగ్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌లో నాలుగో స్థానంలో ప్రారంభించాడు.
ఈ విషయం వెల్లడించింది ఎవరో కాదు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. గంగూలీ తన ఆటో బయోగ్రఫీ 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకంలో తన క్రికెట్ కెరీర్‌లో చోటు చేసుకున్న అనేక విషయాల్ని అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
సెహ్వాగ్‌ను తానే పట్టుబట్టి మరీ ఓపెనింగ్ స్థానానికి పంపించినట్లు గంగూలీ ఈ సందర్భంగా వివరించాడు. 2002లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో అప్పటివరకు నాలుగో స్థానంలో ఆడుతోన్న సెహ్వాగ్‌ను తాను ఓపెనింగ్ స్థానంలో ప్రమోట్ చేశానని తన పుస్తకంలో పేర్కొన్నాడు.
'సెహ్వాగ్‌ని నేనే ఓపెనింగ్ స్థానంలో ప్రమోట్ చేశా. అదెలాగో 'ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎనఫ్' పుస్తకంలో ప్రస్తావించా. మన జీవితంలో కొన్ని ఉత్తమ క్షణాలు అనుకోకుండానే జరుగుతాయి. అలాంటి విషయాలను మన మనసుతో మూసేయవద్దు. ఓపెనర్‌గా నా విషయంలో కూడా అలాగే జరిగింది' అని దాదా తెలిపాడు.
'ఎలా అయితే హెడెన్, లాంగర్ ఓపెనర్లు అయ్యారో... అదే నన్ను సెహ్వాగ్‌ను ఓపెనర్‌గా ప్రమోట్ చేయడానికి ఫోర్స్ చేసింది. 'అవును, నువ్వు చేయగలవు' అని చెప్పా. జీవితంలో కొన్ని ఉత్తమ విషయాలు అనుకోకుండానే జరుగుతాయని అతడిని ఒప్పించా' అని గంగూలీ పేర్కొన్నాడు.
ఆ తర్వాత ఓపెనర్‌గా సెహ్వాగ్ ఎన్ని విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడో మనకు తెలిసిందే. భారత్ తరుపున టెస్టుల్లో రెండు సార్లు ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు సెహ్వాగ్. 2004లో ముల్తాన్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 309, 2008లో చెన్నైలో దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాడు.
భారత్ తరుపున 104 టెస్టులాడిన సెహ్వాగ్ 8586 పరుగులు, 251 వన్డేలాడి 8273, 19 టీ20లాడి 394 పరుగులు నమోదు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ప్రస్తుతం కామెంటేటర్‌గా సెహ్వాగ్ రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. తన హాస్యచతురతతో అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాడు.