
కోల్‌కతా: బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ గురువారం ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. గత శనివారం ఛాతి నొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రిలో చేరిన దాదా.. యాంజియోప్లాస్ట్ చేయించుకున్న ఆరు రోజుల తర్వాత ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. ఇంటికి వెళ్తున్న క్రమంలో హాస్పిటల్ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఆరోగ్యంగా పూర్తిగా బాగుందని గంగూలీ తెలిపారు. ఈ సందర్భంగా తనకు వైద్యసేవలందించి డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆస్ప్రతి నుంచి బయటకు వచ్చిన సౌరవ్ గంగూలీ మీడియాతో మాట్లాడుతూ... 'నాకు వైద్యం అందించిన వుడ్‌ల్యాండ్ ఆస్పత్రి వైద్యులకు కృతజ్ఞతలు. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంతో ఉన్నాను. ఆస్పత్రిలో వైద్యులు జాగ్రత్తగా చూసుకున్నారు. నా జీవితం తిరిగి పొందడానికి వారు సాయపడ్డారు. త్వరలోనే జీవితాన్ని యధాప్రకారంగా కొనసాగించేందుకు, విమానంలో ప్రయాణించడానికి మానసికంగా సిద్ధంగా ఉంటానని ఆశిస్తున్నా' అని అన్నారు. గంగూలీ మూడు నాలుగు వారాల్లో సాధారణ జీవితాన్ని తిరిగి ప్రారంభించవచ్చని వుడ్‌ల్యాండ్ ఎండీ డాక్టర్ రూపాలీ బసు చెప్పారు. గంగూలీ డిశ్ఛార్జ్ కావడంతో ఆయన అభిమానులు ఆనందంలో మునిగితేలుతున్నారు.

వాస్తవానికి సౌరవ్ గంగూలీ బుధవారమే ఇంటికి చేరుకోవాల్సి ఉన్నా.. మరోరోజు ఆస్పత్రిలో ఉండాలని అయన నిర్ణయించుకున్నట్లు వుడ్‌ల్యాండ్స్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. కొద్ది రోజులు దాదా ఆరోగ్య పరిస్థితిని ఆయన నివాసంలోనే వైద్యులు సమీక్షించనున్నారు. ఆరు రోజుల కిందట ఛాతి నొప్పితో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ హాస్పిటల్‌లో చేరిన గంగూలీకి గుండెలోని రక్తనాళాలు రెండు చోట్ల మూసుకుపోవడంతో యాంజియోప్లాస్టీ చేశారు. ప్రస్తుతం దాదా ఆరోగ్యం నిలకడగా ఉండడంతో.. కొద్దిసేపటి క్రితమే హాస్పిటల్ నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు.
మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ భారత్ తరఫున 113 టెస్టులు, 311 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 7212 రన్స్, వన్డేల్లో 11363 పరుగులు చేశాడు. మొత్తం 38 అంతర్జాతీయ శతకాలు నమోదు చేశాడు. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లోనూ 59 మ్యాచ్‌లాడిన దాదా.. 106.81 స్ట్రైక్‌రేట్‌తో 1349 పరుగులు చేశాడు. బౌలర్‌గానూ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 132 వికెట్లు, ఐపీఎల్ 10 వికెట్లని దాదా పడగొట్టారు. మీడియం పేస్ బౌలింగ్ దాదా ఆకట్టుకున్నాడు.