
హైదరాబాద్: పాకిస్థాన్ స్పిన్నర్ షాదాబ్ ఖాన్ రిపోర్టర్లు అడిగిన ప్రశ్నకు ఫన్నీగా సమాధానమిచ్చాడు. ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు స్వదేశంలో శ్రీలంక జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరిస్ ఆడుతోంది. అయితే, రెండో వన్డేకు ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో "హసన్ అలీతో మీకు మంచి స్నేహం ఉంది. అతడు లేకుండా తొలిసారి సిరిస్ ఆడుతున్నారు.. మీ స్నేహితుడు లేకపోవడాన్ని ఎలా ఫీలవుతున్నారు?" అని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించాడు.
ఈ ప్రశ్నకు షాదాబ్ ఇచ్చిన సమాధానం అక్కడున్న వారందరినీ నవ్వులు పూయించింది. షాదాబ్ మాట్లాడుతూ "మేమిద్దరం స్నేహితులం. మీరు అడిగిన విధానం చూస్తుంటే... హసన్, నేను భార్యభర్తలం అనుకుంటున్నారా ఏంటి?" అని అనగానే అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు.
ఆ తర్వాత షాదబ్ మాట్లాడుతూ "అవును, ఈ సిరీస్‌లో నాతో పాటు జట్టు సభ్యులందరూ హసన్ అలీని మిస్సవుతున్నారు. చాలా రోజులుగా మేమిద్దరం ప్రతీ సిరీస్‌లో పాల్గొంటున్నాం. అతడొక అద్భుతమైన వ్యక్తి. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎప్పుడూ సరదాగా ఉంటూ అందరినీ నవ్విస్తాడు. అతడిని మేమందరం మిస్సవుతున్నాం" అని అన్నాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని వీక్షించిన పలువురు నెటిజన్లు షాదాబ్ ఖాన్ టైమింగ్‌ను మెచ్చుకుంటూ కొనియాడుతున్నారు. కాగా, శ్రీలంక సిరీస్‌కు వెన్నునొప్పి కారణంగా హసన్ అలీ దూరమయ్యాడు. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.