
హైదరాబాద్: పూణె వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి. కోల్‌కతా నైట్స్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన జడేజా ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మరో రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు ఆ జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు ఆశించిన శుభారంభం ఇవ్వలేదు. మెక్‌కలమ్‌ను 9 పరుగుల వద్దే ఎంగిడి ఔట్ చేశాడు.
ఆ తర్వాత స్వల్ప స్కోరుకే 3 కీలక వికెట్లు చేజార్చుకుంది. దీంతో పవర్ ప్లే ముగిసే నాటికి వికెట్ నష్టానికి 47 పరుగులు చేసింది. జట్టు స్కోరు 47 పరుగుల వద్ద ఉన్నప్పుడు జడేజా వేసిన ఓ అనూహ్యమైన బంతికి కోహ్లీ బౌల్డయ్యాడు. గింగిరాలు తిరుగుతూ వచ్చిన బంతి అనూహ్యంగా వికెట్లను గిరాటేయడంతో కోహ్లీ సైతం ఆశ్చర్యపోయాడు.
ఈ సీజన్‌లో తన ప్రదర్శనపై తీవ్రమైన విమర్శలు వస్తున్న తరుణంలో మ్యాచ్‌లో తన తొలి ఓవర్ తొలి బంతికే.. అందులోనూ విరాట్ కోహ్లీ లాంటి విధ్వంసక బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసినా.. జడేజా ఎలాంటి సంబరాలు చేసుకోకుండా ప్రశాంతంగా అలానే ఉండిపోయాడు.
ఆ తర్వాత మన్‌దీప్ సింగ్, హాఫ్ సెంచరీతో రాణించిన పార్థివ్‌ను కీలక సమయాల్లో పెవిలియన్‌కు పంపిన జడేజా.. మరోసారి అదే తీరు కనబర్చాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీతో పాటు ఏ వికెట్ తీసినప్పుడూ జడేజా సంబరాలు చేసుకోలేదంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసి జడేజా 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీని ఔట్ చేయడం అతడికి ఇది మూడోసారి కావడం విశేషం. కాగా.. చెన్నైతో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే ఔటవడం కోహ్లీకి ఇదే తొలిసారి.