దాదాపు 14 నెలల అనంతరం ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇచ్చిన రిషభ్ పంత్ మునపటిలా చెలరేగుతున్నాడు. స్టంప్స్ వెనుక చిరుతలా కదులుతూ ప్రత్యర్థి వికెట్ల వేటలో తమ బౌలర్లకు సహకరిస్తున్నాడు. ఇక బ్యాటింగ్‌లో విశ్వరూపమే చూపిస్తున్నాడు. బ్యాటర్, వికెట్ కీపర్, కెప్టెన్‌గా ఆల్‌రౌండ్ షోతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాలు అందిస్తున్నాడు.
ఐపీఎల్-2024లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా పంత్ నిలిచాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు రెండు సార్లు ఈ అవార్డు అందుకున్నాడు. నిన్న గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 బంతుల్లో అజేయంగా 83 పరుగులు సాధించాడు. అయిదు బౌండరీలు, ఎనిమిది సిక్సర్లు బాదాడు. పంత్‌కు తోడుగా అక్షర్ పటేల్ (66; 43 బంతుల్లో, 5x4, 4x6) కూడా చెలరేగడంతో తొలుత ఢిల్లీ నాలుగు వికెట్లకు 224 పరుగులు చేసింది.

అనంతరం ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లకు ఎనిమిది వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (65; 39 బంతుల్లో, 7x4, 2x6), డేవిడ్ మిల్లర్ (55; 23 బంతుల్లో, 6x4, 3x6) పోరాడారు. రషీద్ ఖాన్ (21*; 11 బంతుల్లో, 3x4, 1x6) మ్యాచ్‌ను దాదాపు గెలిపించేంత పనిచేశాడు. కానీ ఢిల్లీ బౌలర్లు రషీద్‌ను కట్టడిచేశారు. కుల్‌దీప్ యాదవ్ (2/29) పొదుపుగా బౌలింగ్ వేశాడు.
అయితే బ్యాటింగ్ చేసే సమయంలో పంత్ ఆడిన భారీ షాట్ కెమెరామెన్ దేబాశిష్‌ను గాయపర్చింది. కావాలని చేయనప్పటికీ తన వల్ల కెమెరామెన్ గాయపడటంతో పంత్ ఎంతో బాధపడ్డాడు. మ్యాచ్ ముగిసిన అనంతరం కోచ్ రికీ పాంటింగ్‌తో కలిసి కెమెరా ముందుకు వచ్చి పంత్ క్షమాపణలు చెప్పాడు. దేబాశిష్ త్వరగా కోలుకోవాలని కోరుకున్నాడు. ''దేబాశిష్ భయ్యా.. క్షమించండి. కావాలని మిమ్మల్ని కొట్టలేదు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. గుడ్ లక్'' అని పంత్ తెలిపాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది. పంత్ మంచి మనసును నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.