
లండన్: నింపాదిగా బ్యాటింగ్ చేస్తున్నాడంటూ ఎడాపెడా విమర్శలను ఎదుర్కొంటున్నాడు టీమిండియా వికెట్ కీపర్, మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ మహేంద్ర సింగ్ ధోనీ. ధోనీపై ఆఫ్ఘనిస్తాన్‌తో మ్యాచ్‌లో మొదలైన ఈ విమర్శల పర్వం.. మ్యాచ్, మ్యాచ్‌కూ తీవ్రరూపం దాల్చుతూనే వస్తోంది గానీ ఎక్కడా తగ్గట్లేదు. ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించిన అనంతరం టీమిండియా ఎదర్కొన్న ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లోనూ అవే విమర్శలు ధోనీని వెంటాడాయి. 336 పరుగుల భారీ లక్ష్యం కళ్లముందు ఉన్నప్పటికీ.. ధోనీ మందకొడిగా బ్యాటింగ్ చేశాడని అంటూ అభిమానులు సైతం తమ నోటికి పని చెప్పారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కూడా ధోనీ మారలేదు. మందకొడిగానే ఆడాడు.
తన సహజసిద్ధమైన దూకుడును పక్కన పెట్టి, సింగిల్స్ తీయడానికి మొగ్గు చూపాడు. దీన్నీ తప్పుపట్టాడు అభిమానులు. సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, సంజయ్ మంజ్రేకర్ వంటి టీమిండియా మాజీ బ్యాట్స్‌మెన్లు సైతం ధోనీ బ్యాటింగ్ శైలిని వేలెత్తి చూపారు.
ఇన్ని విమర్శలు, ఆరోపణల మధ్యన అనూహ్యంగా ఓ సెలెబ్రెటీ ధోనీకి మద్దతు పలికారు. అతనికి అండగా నిలిచారు. ఆమే- సోఫియా చౌదరి. ఇంగ్లండ్‌లో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన గాయని, నటి. మహేష్‌బాబు హీరోగా వచ్చిన వన్-నేనొక్కడినే మూవీలో ఓ ఐటమ్ సాంగ్ చేశారు సోఫియా. ఆమెకు క్రికెట్ అంటే పిచ్చి. ధోనీ బ్యాటింగ్ అంటే వల్లమాలిన అభిమానం. ఆ అభిమానంతోనే సోఫియా చౌదరి ధోనీకి మద్దతు ఇచ్చారు. క్రికెట్ అభిమానులు ధోనీని విమర్శించడం తనకు దిగ్భ్రాంతిని కలగజేస్తోందని సోఫియా వాపోయారు.
ధోనీని తప్పుపట్టాల్సిన అవసరం ఎంతమాత్రమూ లేదని, ఆ అర్హత కూడా లేదని చెప్పుకొచ్చారు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ వంటి టెయిలెండర్లను నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉంచుకుని..వారికి బ్యాటింగ్ అవకాశాన్ని కల్పించడానికి ఎవరైనా ఒకటికి, రెండుసార్లు ఆలోచిస్తారని అన్నారు. స్ట్రైక్‌ను రొటేట్ చేయకుండా- ధోనీ తానే ఎక్కువగా స్ట్రైకింగ్ చేయడానికి ప్రధాన కారణం అదేనని విశ్లేషించారు. మిడిలార్డర్‌లో వచ్చినప్పటికీ.. జట్టు కేప్టెన్ విరాట్ కోహ్లీ కంటే ఎక్కువగా స్కోర్ చేస్తున్నాడని, బాధ్యతలను భుజాన వేసుకుంటున్నారని ట్వీట్ చేశారు సోఫియా.