
వేలం జరిగేది ఇలా:
దీని వల్ల మరింత పారదర్శకతకు అవకాశం ఉంటుందని, బోర్డు అధికారులతో ప్రచార సంస్థలు లోపాయికారీగా సమాచారం తెలుసుకొని అవినీతికి పాల్పడకుండా ఉంటుందని వారు చెబుతున్నారు. ఆన్‌లైన్‌లో వేలం ప్రక్రియ ప్రారంభమయ్యాక బిడ్డర్లు తాము చెల్లించగలిగే మొత్తాన్ని అందులో పేర్కొనాల్సి ఉంటుంది. అది పెరుగుతూ వెళ్లి చివరకు అత్యధిక మొత్తం వేసిన బిడ్డర్‌కు హక్కులు దక్కుతాయి. అయితే స్క్రీన్‌పై బిడ్డింగ్ మొత్తం చూపించినా... అది ఎవరు వేస్తున్నారనేది మాత్రం ప్రదర్శించరు.

వేలంలోనే మూడు రకాల హక్కులు:
తాజా వేలంలో బీసీసీఐ మూడు రకాల హక్కులకు బిడ్‌లను ఆహ్వానించింది. భారతదేశం వరకు టీవీ హక్కులతో పాటు మిగిలిన అన్ని దేశాలకు కలిపి డిజిటల్ హక్కులు ఇందులో మొదటిది. భారత ఉపఖండానికి మాత్రమే పరిమితమయ్యే విధంగా డిజిటల్ హక్కులు రెండోది. భారత ఉపఖండం, ఇతర ప్రపంచ దేశాల టీవీ హక్కులతో పాటు ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ హక్కులు (గ్లోబల్ కన్సాలిడేటెడ్ రైట్స్) మూడోది.

వేలం ధరలు కింది విధంగా:
2018-19 సీజన్‌కు ఒక్కో మ్యాచ్ కనీస ధర, ఆ తర్వాతి నాలుగేళ్లకు ఒక్కో మ్యాచ్ కనీస ధరను వేర్వేరుగా నిర్ణయించారు. వచ్చే సీజన్‌లో డిజిటల్ హక్కుల కనీస ధర రూ. 8 కోట్లు కాగా, ఆ తర్వాత అది రూ. 7 కోట్లుగా ఉంది. గ్లోబల్ హక్కుల కోసం తర్వాతి నాలుగేళ్ల కాలానికి ప్రతీ మ్యాచ్‌కు రూ. 40 కోట్ల కనీస ధర ఉండటం విశేషం.

ఏయే మ్యాచ్‌లకు సంబంధించిన ప్రసారలంటే:
జూన్ 2018 నుంచి మార్చి 2023 మధ్య భారత గడ్డపై మొత్తం 102 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 22 టెస్టులు కాగా...45 వన్డేలు, మరో 35 టి20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ అన్ని మ్యాచ్‌ల ప్రసార హక్కుల కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నేడు వేలం నిర్వహిస్తోంది. సుప్రీం కోర్టు నియమించిన క్రికెట్ పరిపాలకుల కమిటీ (సీఓఏ), బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కలిసి ఈసారి సీల్డ్ కవర్ విధానానికి బదులుగా ఈ-ఆక్షన్ పద్ధతిని అమలు చేయాలని నిర్ణయించారు.