ఈడెన్‌లో తొలి సెంచరీ, కెరీర్ కోసం సాధారణ వ్యక్తుల్లాగా రైళ్లలో: ఎవరీ ఆర్యమన్ బిర్లా?

హైదరాబాద్: ఆర్యమన్ విక్రమ్ బిర్లా... సాధారణ వ్యక్తుల్లాగా రైళ్లలో ప్రయాణం చేస్తున్నాడు. ఏసీ కార్ల నుంచి కాలు కిందపెట్టే అవసరం కూడా లేని ఆర్యమన్, తనకు ఎంతో ఇష్టమైన కెరీర్ కోసం మైదానంలో చెమటోడుస్తున్నాడు. మైదానంలో కఠోర ప్రాక్టీస్ చేస్తూ తన కెరీర్‌ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డాడు.
ఇంతకీ ఎవరీ ఆర్యమన్ విక్రమ్ బిర్లా అని అనుకుంటున్నారా? మన దేశంలోని బిలియనీర్ బిజినెస్ టైకూన్ ఆదిత్య కుమారమంగళం బిర్లా తనయుడు. మధ్యప్రదేశ్ తరపున రంజీల్లో ఆడుతున్న 21 ఏళ్ల ఆర్యమన్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో తన తొలి సెంచరీని సాధించాడు.
రౌండ్ 2, ఎలైట్ గ్రూప్ బి మ్యాచ్‌లో భాగంగా బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్యమన్ బిర్లా 189 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 103 పరుగులతో సెంచరీతో రాణించి ఆ జట్టును ఓటమి నుంచి తప్పించాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. గతేడాది అండర్-23 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో వెలుగులోకి వచ్చిన ఆర్యమన్‌ను గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టులో చోటు దక్కించుకున్నాడు.

ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో వేలం
ఐపీఎల్ 2019 కోసం డిసెంబర్ నెలలో వేలం నిర్వహించనున్నారు. దీంతో వచ్చే సీజన్ కోసం ఫ్రాంఛైజీలు ఇప్పటి నుంచే తమ కసరత్తులను ముమ్మరం చేసాయి. నవంబర్ 15లోగా ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అందించాలని ఐపీఎల్ నిర్వాహకులు సూచించడంతో ఫామ్‌లో లేని ఆటగాళ్లందరినీ ఫ్రాంచైజీలు విడుదల చేశాయి.

ఆర్యమన్ బిర్లాను అట్టిపెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్
ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆర్యమన్ బిర్లాను అట్టిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్యూలో ఆర్యమన్ బిర్లా మాట్లాడుతూ "ఈ సెంచరీ నాకు ఎంతో అద్భుతమైనది. 69 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి వచ్చా. కోల్‌కతాతో మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. మా నాన్న ఇక్కడే పుట్టారు. నా చిన్నప్పటి నుంచి ఇక్కడికి వస్తునే ఉన్నా. ఈడెన్ గార్డెన్స్‌లో నా తొలి ఫస్ట్ క్లాస్ సెంచరీ చేయడం ఓ గొప్ప అనుభూతి" అని అన్నారు.

ఇంటి పేరు వల్ల తనపై ఒత్తిడి ఏమీ లేదన్న ఆర్యమన్
అంతేకాదు బిర్లా అనే ఇంటి పేరు వల్ల తనపై ఒత్తిడి ఏమీ లేదని ఆర్యమన్ అన్నాడు. "ఇంటి పేరు వల్ల నాపై ఒత్తిడి ఉంటుందని కొంతమంది అంటుంటారు. అవును ఆ పేరుకు ఉన్న గొప్పదనం అలాంటిది. ఇప్పుడు నాకిష్టమైన క్రికెట్‌లో గొప్ప పేరు సాధించి ఆ ఖ్యాతిని అలాగే కొనసాగించాలని అనుకుంటున్నా" అని ఆర్యమన్ చెప్పాడు.

నా ధ్యాసంతా 22 గజాల పిచ్ గురించే
"బిర్లా కుటుంబం నుంచి వచ్చినా కూడా ఆడేటపుడు నా దృష్టంతా బంతి మీదే ఉంటుంది. 22 గజాల పిచ్ గురించే నా ధ్యాసంతా. అలాంటి కుటుంబంలో పుట్టినందుకు నేను చాలా అదృష్టవంతుణ్ని. నా కుటుంబ సభ్యులే నాకు స్ఫూర్తి ప్రదాతలు. కుటుంబంలో ప్రతి ఒక్కరు వాళ్లు ఎంచుకున్న రంగంలో శ్రమపడుతూనే ఉన్నారు" అని తెలిపాడు.

గత నాలుగేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నా
ఇక, ముంబైలో పుట్టినప్పటికీ మధ్య ప్రదేశ్ తరుపున ఆడటానికి ఓ కారణం ఉందని చెప్పాడు. విపరీతమైన పోటీ ఉండే ముంబైలో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో తాను మధ్యప్రదేశ్‌కు ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. "గత నాలుగేళ్లుగా ప్రొఫెషనల్ క్రికెట్ ఆడుతున్నా. ముంబైలో సరైన అవకాశాలు రాకపోవడంతో మధ్యప్రదేశ్‌కు వచ్చేశా. అండర్-23 స్థాయిలో మంచి ప్రదర్శన చేసి రంజీ జట్టుకు ఎంపికయ్యా" అని అన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications