
ఐపీఎల్లో ఆడటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు
తాజాగా భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... 'భారత జట్టుకు ఆడటం కంటే.. ఐపీఎల్‌లో ఆడటానికే కొందరు ఆటగాళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అలాంటి వారికి మనమేం చెప్పగలం?. వారి ఆర్థిక పరిస్థితుల గురించి నాకు తెలియదు. కానీ దేశం తరఫున ఆడటాన్ని ఆటగాళ్లంతా గొప్ప గౌరవంగా భావించాలి.
నేనైతే భారత్ తరఫున ఆడేందుకే మొదటి ప్రాధాన్యమిస్తాను. ఆ తర్వాతే ఏదైనా. ఐపీఎల్‌లో ఆడొద్దని నేను చెప్పను. ఐపీఎల్ వల్లే చాలా మందికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. కానీ, దాన్ని ఆటగాళ్లు సక్రమంగా ఉపయోగించుకోలేపోతున్నారు. మ్యాచ్‌ల షెడ్యూలింగ్ విషయంలో బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి. భారత్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టోర్నమెంట్లను ఖరారు చేయాలి' అని అన్నాడు.

ఇప్పటికీ మించిపోయిందేం లేదు
'టీ20 ప్రపంచకప్ 2021 నుంచి భారత్ నిష్క్రమించడం బాధాకరమే. అయినా ఇప్పటికీ మించిపోయిందేం లేదు. రానున్న ప్రపంచకప్ కోసం మరింత మెరుగ్గా తయారవ్వాలి. ఐపీఎల్‌కి, టీ20 ప్రపంచకప్‌కి కొంచెం వ్యవధి ఉండి ఉంటే భారత్ పరిస్థితి మరోలా ఉండేదేమో. అందుకే ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా బీసీసీఐ జాగ్రత్తగా వ్యవహరించాలి' అని కపిల్ దేవ్ పేర్కొన్నాడు.
2012 తర్వాత ఓ ఐసీసీ టోర్నమెంట్‌లో కనీసం సెమీస్ కూడా చేరకుండా వెనుదిరగడం టీమిండియాకు ఇదే తొలిసారి. ఇక మెగా టోర్నీలో నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో భారత్ మరికొద్దిసేపట్లో నమీబియాతో తలపడనుంది. గ్రూప్-2 నుంచి పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

టాస్ ఓడితేనే మ్యాచ్‌లు ఓడిపోతారా
టీ20 ప్రపంచకప్ 2021లో టీమిండియా ప్రదర్శనపై మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా స్పందించాడు. ప్రపంచకప్‌లలో టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శనల్లో ఇది ఒకటని అభిప్రాయపడ్డాడు. 'తొలి రెండు మ్యాచుల్లో విరాట్ కోహ్లీ టాస్ ఓడిన మాట నిజమే. కేవలం టాస్ ఓడితేనే మ్యాచ్‌లు ఓడిపోతారా?. షార్జాలో ఇంగ్లండ్‌పై టాస్ ఓడినా కూడా దక్షిణాకా గెలవలేదా?. ఓడిన రెండు మ్యాచుల్లో మంచు కారణంగా భారత బౌలర్లు కొంత ఇబ్బందులు పడిన మాట వాస్తవమే.
కానీ ఆ మ్యాచుల్లో టీమిండియా బ్యాట్స్‌మెన్ రాణించకపోవడమే అసలు సమస్య. బ్యాటర్లు భారీ స్కోర్లు చేసి ఉంటే ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి ఉండేది. కోహ్లీ కెరీర్‌లోనే అత్యంత నిరాశాజనక టోర్నీ ఇది. 2007 టీ20 ప్రపంచకప్ తర్వాత ఒకటి రెండు సార్లు టీమిండియా సెమీస్ వరకూ వెళ్లలేదు. కానీ గడిచిన 7-8 సంవత్సరాల్లో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఇప్పుడు సెమీస్ చేరకుండా వెనుతిరగడం టీమిండియా జట్టును చాలా బాధిస్తుంది' అని చోప్రా అన్నాడు.


Click it and Unblock the Notifications












