IND vs ENG:భారత క్రికెటర్లపై ఆవేశంతో ఊగిపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్..ఐపీఎల్ 2021ని బహిష్కరిస్తామని హెచ్చరిక!

లండన్: ఐదు టెస్ట్ మ్యాచుల సిరీసులో భాగంగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మాంచెస్టర్ వేదికగా శుక్రవారం నుంచి ప్రారంభమవ్వాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ రద్దయిన విషయం తెలిసిందే. మ్యాచుకు మూడు గంటల ముందు చివరి టెస్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ప్రకటించింది. భారత బృందంలో కరోనా కేసులు పెరగడమే అందుకు కారణం. వరుసగా భారత కోచ్‌లు వైరస్ బారిన పడడంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)తో సుదీర్ఘ చర్చల అనంతరం ఈసీబీ రద్దు నిర్ణయం తీసుకుంది. అయితే ఐదో టెస్టు ఆడేందుకు భారత క్రికెటర్లు నిరాకరించినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

భయాందోళనకి గురైన భారత క్రికెటర్లు:
టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి తన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి గత వారం హాజరవగా.. అతనితో పాటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వెళ్లాడు. అక్కడే రవిశాస్త్రికి కరోనా సోకగా.. అతని నుంచి బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్‌లకు కూడా వైరస్ సోకింది. అనంతరం ఫిజియో యోగేశ్ పర్మార్ కరోనా వచ్చింది. దాంతో భయాందోళనకి గురైన భారత క్రికెటర్లు ఐదో టెస్టు కోసం మైదానంలోకి వచ్చేందుకు విముఖత ప్రదర్శించారు. భారత క్రికెటర్ల వ్యవహార శైలితో తొలుత ఐదో టెస్టులో మొదటి రోజుని రద్దు చేసిన ఈసీబీ.. ఆటగాళ్లతో మాట్లాడిన తర్వాత మ్యాచ్ మొత్తాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఆవేశంతో ఊగిపోయిన ఇంగ్లండ్ ప్లేయర్స్:
ఐదో టెస్ట్ రద్దు విషయంపై బీసీసీఐ, ఈసీబీ బోర్డుల మధ్య చర్చలు గంట వ్యవధిలో ముగిసాయి. ఈ మధ్యలో ఇంగ్లండ్ క్రికెటర్లు కాసేపు ఆవేశంతో ఊగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. ఐదో టెస్టు రద్దుకి కారణమైన టీమిండియా ఆటగాళ్లపై ఇంగ్లండ్ ప్లేయర్స్ విమర్శలు గుప్పించారట. అంతటితో ఆగకుండా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్‌ని బహిష్కరిస్తామని కూడా హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. టీమిండియా క్యాంప్‌లో కరోనా కేసులు నమోదవుతున్నా.. మాంచెస్టర్‌లో భారత క్రికెటర్లు స్వేచ్ఛగా తిరగడంపై కూడా ఇంగ్లీష్ ఆటగాళ్లు మండిపడినట్లు వార్తలు వెలుబడ్డాయి.

ఐపీఎల్ బహిష్కరణపై చర్చ:
ఐపీఎల్ 2021లో ఆడుతున్న ఇంగ్లండ్ క్రికెటర్లలో ఐదుగురు మాత్రమే టెస్టు సిరీస్‌లో ఆడుతున్నారు. జానీ బెయిర్‌స్టో, సామ్ కరన్, మొయిన్ అలీ, డేవిడ్ మలాన్, క్రిస్ వోక్స్ ఐపీఎల్ రెండో దశ ఆడనున్నారు. వీళ్లందరూ కూడా ఐదో టెస్టు రద్దు తర్వాత ఐపీఎల్ 2021 సీజన్ బహిష్కరణపై చర్చించి.. సాహసోపేత నిర్ణయం తీసుకోబోయారట. అయితే అక్కడే ఉన్న ఇతర ఇంగ్లీష్ క్రికెటర్లు వారికి సర్దిచెప్పారట. దాంతో వారు మనసు మార్చుకుని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే ఒక ప్లేయర్ మాత్రమే మిగతావారిని రెచ్చగొట్టాడని సమాచారం. టెస్ట్ సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. ఐదో మ్యాచ్ రద్దయితే వారు సొంత గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోవాల్సి ఉంటుంది. ఇది మింగుడుపడని ఇంగ్లీష్ ప్లేయర్స్ అలా హెచ్చరించారట.

ఐపీఎల్‌కి సమస్య వస్తుందని:
నిజానికి తొలుత ఐదో టెస్ట్ మొదటి రోజు ఆటని మాత్రమే రద్దు చేసిన ఈసీబీ.. ఆ తర్వాత మ్యాచ్‌ని రీషెడ్యూల్‌కి ఉన్న అవకాశాల్ని పరిశీలించిందట. కానీ బీసీసీఐ ఆ రీషెడ్యూల్‌కి ఒప్పుకోకపోవడంతో.. మ్యాచ్‌ని ఈసీబీ రద్దు చేయక తప్పలేదు. సెప్టెంబరు 19 నుంచి యూఏఈ వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 రెండో దశ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సమయంలో ఐదో టెస్టుని రీషెడ్యూల్ చేస్తే.. ఐపీఎల్‌కి సమస్య వచ్చే అవకాశాలు ఉన్నాయని భావించిన బీసీసీఐ మ్యాచు రద్దుకే మొగ్గుచూపినట్టు స్పష్టంగా తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఐదో టెస్టు సెప్టెంబరు 10 నుంచి 14 వరకూ జరగాల్సి ఉండగా.. 15న ఇంగ్లండ్ నుంచి టీమిండియాతో పాటు ఇంగ్లండ్ క్రికెటర్లు కూడా బయల్దేరి యూఏఈకి వెళ్లాల్సి ఉంది. దాంతో మ్యాచ్ రద్దు మినహా మరో మార్గం లేకపోయింది.

ఇంగ్లండ్‌కు గంగూలీ:
ఐదో టెస్ట్ మ్యాచ్ రద్దవడంతో ఈసీబీకి సుమారు రూ.200 కోట్లు నష్టం రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాంతో భవిష్యత్‌లో ఈ మ్యాచ్ తిరిగి నిర్వహించడానికి బీసీసీఐ ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు ఈసీబీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే ఇదే విషయంపై ఈసీబీ ప్రతినిధులతో మాట్లాడేందుకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ త్వరలో ఇంగ్లండ్‌కు వెళ్లనున్నాడని తెలిసింది. సెప్టెంబర్ 22న లేదా 23న గంగూలీ అక్కడికి వెళ్లి ఈసీబీతో పాటు మ్యాచ్ ప్రసార హక్కుదారులతో చర్చలు జరుపుతాడని సమాచారం. ఆ సమావేశం అనంతరం ఐదో టెస్ట్ ఎప్పుడు జరగనుందనేది తేలనుంది. దాదాపుగా వచ్చే ఏడాదే మ్యాచ్ జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

జూలై ఒకటిన ఆరంభం:
వచ్చే ఏడాది ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత భారత్‌తో 3 వన్డేలు, 3 టీ20లు ఇంగ్లీష్ జట్టు ఆడనుంది. జూలై ఒకటిన ఓల్డ్‌ట్రాఫర్డ్‌లో జరిగే మ్యాచ్‌తో టీ20 సిరీస్ మొదలుకానుంది. తదుపరి రెండు మ్యాచ్‌లు ట్రెంట్‌బ్రిడ్జ్ (జూలై 3), ఏజెస్ బౌల్ (జూలై 6)లో జరుగుతాయి. 3 వన్డేలను ఎడ్జ్‌బాస్టన్ (జూలై 9), ఓవల్ (జూలై 12), లార్డ్స్ (జూలై 14)లో నిర్వహిస్తారు. ఈ సిరీసుకు ముందుగాని లేదా తర్వాత కానీ ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications