
కరాచీ: ఇటీవల కాలంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు ఒకరిపై ఒకరు విమర్శల వర్షం కురిపించుకుంటున్నారు. కరోనా వైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా పాక్ క్రికెటర్లు గతాన్ని తవ్వుకుంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ హెడ్ కోచ్ మిస్బావుల్ హక్‌ను ఆ దేశ దిగ్గజ క్రికెటర్ మహ్మద్ యూసఫ్ విమర్శించగా.. ఇమ్రాన్ ఖాన్, అక్రమ్‌లపై బాసిత్ అలీ మండిపడ్డాడు. తాజాగా డానిష్ కనేరియా-ఫైజల్ ఇక్బాల్‌ల మధ్య సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ వెటరన్ పేసర్ సోహైల్ తన్వీర్ స్పందించాడు. పాకిస్తాన్ క్రికెట్‌లో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలపై స్పదించాడు. కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న వ్యాఖ్యల వల్ల పాక్ ఆటగాళ్లతో పాటు బోర్డుకు ఇబ్బందికరంగా మారుతున్నదని అభిప్రాయపడ్డాడు. సోషల్ మీడియా వేదికగా ఇలా బహిరంగ విమర్శలు చేసుకోవడం మంచిది కాదని సూచించాడు. విమర్శల వలన పాకిస్తాన్ క్రికెట్‌కు చెడ్డ పేరు రావడమే కాకుండా, చులకనగా మారిపోతామన్నాడు. ఈ విషయంలో మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.
'మా మాజీ, ప్రస్తుత క్రికెటర్లు సోషల్ మీడియాను మరింత బాధ్యతగా ఆలోచనాయుతంగా వినియోగించాలి. కొందరు చేస్తున్న వ్యాఖ్యల వల్ల పాకిస్థాన్ క్రికెట్‌పట్ల ప్రతికూలభావం పెరుగుతున్నది. నేరుగా పంచుకోలేని మాటలను, అభిప్రాయాలను ఎవరూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించకండి. ఎందుకంటే మరోసారి కలవాల్సి వచ్చినప్పుడు ఇద్దరికీ ఎంతో ఇబ్బంది కరంగా ఉంటుంది' అని తన్వీర్ అభిప్రాయపడ్డాడు.
పాకిస్తాన్ తరఫున రెండు టెస్టులు మాత్రమే ఆడిన సోహైల్ తన్వీర్.. 62 వన్డేలు, 57 అంతర్జాతీయ టీ20లకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో పాకిస్తాన్ తరఫున సోహైల్ ఆడాడు. అయితే సీపీఎల్, పీఎస్ఎల్ లాంటి లీగుల్లో సత్తాచాటుతున్నాడు. 2017 సీపీఎల్‌లో తన్వీర్ అద్భుత ప్రదర్శన చేశాడు. గయానా అమెజాన్ వారియర్స్ తరపున ఆడిన అతడు 4 ఓవర్లు వేసి కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఐపీఎల్ మొదటి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడాడు.