శ్రీలంక ఆటగాళ్ళ తీరుతో చాలా నిరాశ చెందా.. పాక్ మీకిచ్చిన సపోర్ట్ మరిచిపోయారా?

కరాచీ: పాకిస్తాన్ పర్యటన నుండి వైదొలిగిన శ్రీలంక ఆటగాళ్ళ తీరుతో చాలా నిరాశ చెందా. కష్టసమయంలో కూడా మీకు పాకిస్తాన్ ఎప్పుడూ అండగానే ఉంది. మీకిచ్చిన సపోర్ట్ మరిచిపోయారా? అని పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్, 'రావల్పిండి ఎక్స్‌ప్రెస్' షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. సెప్టెంబర్ నెలలో లంక జట్టు పాక్‌లో వన్డే, టీ20 సిరీస్ కోసం పర్యటించాల్సి ఉంది. లంక కెప్టెన్లు దిముత్ కరుణరత్నే, లసిత్ మలింగ.. ఏంజిలో మాథ్యూస్ లాంటి సీనియర్ ఆటగాళ్లతో పాటు మొత్తం 10 మంది లంక ఆటగాళ్లు పాక్ పర్యటనను నిరాకరించారు. దీనిపై అక్తర్ స్పందించాడు.
మీకిచ్చిన సపోర్ట్ మరిచిపోయారా?:
అక్తర్ మాట్లాడుతూ... 'పాకిస్తాన్ పర్యటన నుండి వైదొలిగిన 10 మంది శ్రీలంక ఆటగాళ్ళ తీరుతో చాలా నిరాశ చెందా. పాకిస్తాన్ ఎల్లప్పుడూ లంక క్రికెట్‌కు మద్దతుగా ఉంది. పాక్ మీకిచ్చిన సపోర్ట్ మరిచిపోయారా?. ఇటీవల శ్రీలంకలోని ఒక చర్చిలో ఘోరమైన దాడుల తరువాత కూడా పాకిస్తాన్ అండర్-19 జట్టును లంక పర్యటనకు పంపాం. దాడి తర్వాత తొలుత పర్యటించిన జట్టు పాకిస్తానే' అని అన్నాడు.

మద్దతు ఆశిస్తున్నాం:
'1996 ప్రపంచకప్‌ను ఎవరు మరచిపోగలరు. భద్రతా కారణాలతో శ్రీలంకలో ఆడబోమని ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్లు వెనకడుగేశాయి. ఆ సమయంలో భారత్‌తో పాటు లంకకు పాకిస్తానే అండగా ఉంది. కొలంబోలో స్నేహపూర్వక మ్యాచ్ ఆడటానికి భారత్‌తో పాటు పాకిస్తాన్ ఒక జట్టును పంపింది. ఇప్పుడు మేం కష్టాల్లో ఉన్నాం కాబట్టి శ్రీలంక నుంచి మద్దతు ఆశిస్తున్నాం. బోర్డు సహకారం అందిస్తున్నది కాబట్టి.. ఆటగాళ్లు కూడా మాకు అండగా నిలవాలి' అని అక్తర్ కోరాడు.

కెప్టెన్‌లుగా తిరిమన్న, షణకా:
పాకిస్థాన్ పర్యటనకు శ్రీలంక క్రికెట్ బోర్డు బుధవారం జట్టుని ప్రకటించింది. సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 9వ వరకు జరగనున్న ఈ పర్యటనలో శ్రీలంక జట్టు 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. అయితే, భద్రతా కారణాలు దృష్ట్యా ఈ సిరిస్‌లో పాల్గొనేందుకు పలువురు సీనియర్ క్రికెటర్లు నిరాకరించారు. దీంతో ఆ పది మంది ఆటగాళ్లకు బోర్డు జట్టులో చోటు కల్పించలేదు. ఈ పర్యటనలో వన్డే సిరిస్‌కు కెప్టెన్‌గా లాహిరు తిరిమన్నేని నియమించగా.. టీ20లకు కెప్టెన్‌గా దాసున్ షణకాను నియమించింది.

వన్డే జట్టు:
లాహిరు తిరుమన్నే(కెప్టెన్), సధీరా సమరవిక్రమా, అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, దసున్ శనకా, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా.

టీ20 జట్టు:
దసున్ శనకా(కెప్టెన్), సధీరా సమరవిక్రమా,అవిస్క ఫెర్నాండో, ఓషాడా ఫెర్నాండో, షెహన్ జయసూర్య, ఎంజిలో పెరీరా, మినొద్ భనుకా, వనిండు హసరంగా, లక్షన్ సాంధకన్, నువాన్ ప్రదీప్, కసున్ రజితా, లహిరు కుమారా, ఇసురు ఉడానా, భానుక రాజపక్ష.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications