ముంబై: వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌తో కలసి స్నేహం చేస్తున్న బాలీవుడ్, టాలీవుడ్ కథానాయిక స్నేహా మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. క్రిస్ గేల్ తనను పొగడ్తలతో ముంచెత్తాడని చెప్పుకుని మురిసిపోతోంది. తమ పరిచయం ఎలా జరిగిందన్న విషయాన్ని మరోసారి వివరించారు.
'ఓ ప్రైవేటు పార్టీలో ఇద్దరమూ కలిశాం. తనే నా వద్దకు వచ్చి మాట్లాడాడు. మేమిద్దరమూ ఫోన్ నంబర్లు మార్చుకున్నాం. ఆపై అప్పుడప్పుడూ మాట్లాడుకునే వాళ్లం. నన్ను మానవ రూపంలో ఉన్న బొమ్మ అని గేల్ అంటుండే వాడు' అని స్నేహా సంబరపడిపోతోంది.
అంతేగాక, 'బాలీవుడ్ అంటే అతను చూపే అభిమానం చూసి ఆశ్చర్యపోయాను.
అమితాబ్ బచ్చన్ ను కలిసేందుకు చావడానికైనా సిద్ధమనేంత అభిమాని. అతని డ్యాన్సులు, పాటలు పాడే విధానం నాకెంతో నచ్చాయి. ఎప్పుడూ నియంత్రణలో ఉంటాడు' అని చెప్పుకొచ్చింది స్నేహా ఉల్లాల్.
ప్రస్తుతం టీ-20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా గేల్, డ్వేన్ బ్రావో ఇండియాలోనే ఉండగా, వారితో కలసి పార్టీ చేసుకున్న ఫొటోలను ఇటీవల తన ట్విట్టర్ ఖాతాలో స్నేహా ఉల్లాల్ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.