Smriti Mandhana: టీమిండియా మహిళా జట్టు వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన ఆటతీరుతోనే కాకుండా.. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన తాజా వార్తతో కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారారు. మ్యూజిక్ డైరెక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్ పలాష్ ముచ్చల్‌తో స్మృతి మంధాన రిలేషన్‌షిప్‌లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా వారి పెళ్లిపై పలాష్ ముచ్చల్ స్వయంగా ఓ కీలక అప్‌డేట్ ఇచ్చారు.
త్వరలో ఇండోర్ కోడలిగా స్మృతి మంధాన
ప్రస్తుతం భారత్ వేదికగా మహిళా ప్రపంచ కప్ 2025 జరుగుతున్న నేపథ్యంలో మ్యాచ్‌లకు ముందు ఇండోర్‌కు చేరుకున్న పలాష్ ముచ్చల్ ఈ గుడ్ న్యూస్‌ను పంచుకున్నారు. ఇండోర్‌లోని స్టేట్ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. పలాష్ తమ సంబంధాన్ని బహిరంగంగా ధ్రువీకరించడమే కాకుండా పెళ్లి గురించి కూడా హింట్ ఇచ్చారు.

పలాష్ ముచ్చల్ మాట్లాడుతూ.. "ఆమె(స్మృతి మంధాన) త్వరలో ఇండోర్ కోడలు కాబోతోంది. నేను చెప్పదలుచుకుంది ఇంతే. మీకు నేను హెడ్‌లైన్ ఇచ్చేశాను" అని ఉల్లాసంగా చెప్పారు. పలాష్ ముచ్చల్ స్వతహాగా ఇండోర్‌కు చెందిన వ్యక్తి కావడం వల్ల స్మృతి మంధాన త్వరలో ముచ్చల్ కుటుంబంలోకి అడుగుపెట్టడం ద్వారా ఇండోర్ కోడలు అవతారని ఆయన స్పష్టం చేశారు. ఓ సెలబ్రిటీ వేదికపై తమ పెళ్లి గురించి పలాష్ మాట్లాడటం ఇదే మొదటిసారి.
పలాష్-స్మృతి సంబంధం
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ తరచుగా తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ఒకరితో ఒకరు దిగిన ఫోటోలను పంచుకుంటూ తమ రిలేషన్‌షిప్‌ను హింట్‌గా ఇస్తూ వచ్చారు. వారి బంధంపై గత కొంతకాలంగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ.. 30 ఏళ్ల పలాష్ ముచ్చల్ శుక్రవారం అధికారికంగా ధ్రువీకరించడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. పెళ్లి ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనే కచ్చితమైన తేదీ వివరాలు ఇంకా తెలియనప్పటికీ.. ఈ జంట త్వరలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని పలాష్ ముచ్చల్ మాటలు స్పష్టం చేశాయి.
పెళ్లి వార్తలతో పాటు పలాష్ ముచ్చల్ క్రికెట్ పై కూడా తన ప్రేమను వ్యక్తపరిచారు. ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో జరిగే ప్రపంచ కప్ మ్యాచ్ కోసం టీమిండియాకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. "నా శుభాకాంక్షలు భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతితో పాటు జట్టు మొత్తానికి ఉన్నాయి. భారత క్రికెట్ జట్టు ప్రతి మ్యాచ్ గెలిచి దేశానికి పేరు తీసుకురావాలని మేము ఎల్లప్పుడూ కోరుకుంటాము," అని పలాష్ ముచ్చల్ అన్నారు. కాగా.. స్మృతి మంధాన ఇటీవలే ఆస్ట్రేలియాపై కేవలం 66 బంతుల్లో 80 పరుగుల అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, వన్డే క్రికెట్‌లో తన 5000 పరుగులు మైలురాయిని కూడా పూర్తి చేసుకున్నారు. క్రికెట్ మైదానంలో అద్భుతంగా రాణిస్తున్న ఈ స్టార్ ప్లేయర్, త్వరలో వైవాహిక జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించనున్నారు.