
ఆన్‌లైన్‌లో లూడో ఆడుతున్నాం:
బీసీసీఐకి ఇచ్చిన వీడియో ఇంటర్వ్యూలో స్మృతి మంధాన మాట్లాడుతూ... 'లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ఎక్కువ కాలం దూరంగా ఉన్నా.. జట్టు సభ్యుల మధ్య బంధం తగ్గకుండా ఉండేందుకు అందరం కలిసి ఆన్‌లైన్‌లో లూడో ఆడుతున్నాం. దీంతో మేమంతా సన్నిహితంగా ఒక్కచోటే ఉన్న భావన కలుగుతోంది. మైదానంలో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా ఇలానే ఉంటాం. అందరం రోజు మాట్లాడుకుంటున్నాం' అని తెలిపింది.

ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నా:
'రోజులో మొదట నేను వర్కవుట్లు చేస్తాను. ఏ సమయంలోనైనా ఫిట్‌గా ఉండటం చాలా ముఖ్యం. మా ఇంట్లో నాకు వర్కవుట్లు చేసుకోవటానికి ఓ మంచి ప్రదేశం ఉంది. ఎంతో కష్టపడి దానిని ఏర్పాటు చేసుకున్నాను. రోజూ మా ట్రైనర్‌తో మాట్లాడతాను. ఆయన నేను చేయాల్సిన వ్యాయామాన్ని తెలియచేస్తారు.. నేను దాన్ని అనుసరిస్తాను. ట్రైనర్ పంపించిన షెడ్యూల్‌ను అనుసరిస్తూ.. ఫిట్‌నెస్‌ను కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నా' అని మంధాన చెప్పింది.

గిన్నెలు శుభ్రం చేస్తున్నా:
ఎడంచేతి వాటం బ్యాటర్ లాక్‌డౌన్‌లో తాను ఎలా సమయం గడుపుతున్నానో చెప్పింది. ‘కుటుంబ సభ్యులందరం సరదాగా గడుపుతున్నాం. అందరం కలిసి పేకాట ఆడుతాం. మా అమ్మకి వంటలో, గిన్నెలు శుభ్రం చేయటంలో సాయం చేస్తాను. ఈ పని నా రోజువారీ కార్యక్రమాల్లో భాగమైపోయింది. ఇక సోదరుడితో అల్లరి ఎలాగూ ఉంటుంది. సినిమాలంటే బాగా ఇష్టం. వారానికి రెండు, మూడు సినిమాలు చూస్తున్నాను. అన్నింటికి మించి నాకు ఇష్టమైన వ్యాపకం నిద్ర. రోజుకు కనీసం 10 గంటలు పడుకుంటున్నాను. దాని వల్ల మిగిలిన రోజంతా హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తోంది' అని 23 ఏళ్ల మంధాన పేర్కొంది.

ప్రపంచకప్‌లో విఫలం:
2018లో అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా బీసీసీఐ గుర్తింపు పొందిన స్మృతి మంధాన.. ఆఖరుగా మహిళల టీ20 ప్రపంచకప్ పోటీల్లో కనిపించింది. దీనిలో నాలుగు మ్యాచ్‌లలో పాల్గొన్న స్మృతి కేవలం 49 పరుగుల్ని మాత్రమే సాధించగలిగింది. స్మృతితో పాటు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా విఫలమవడంతో కప్ చేజారింది. ఇక కొవిడ్-19 కాలంలో అందరూ ఇంట్లోనే ఉండాలంటూ స్మృతి మంధాన ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తోంది.


Click it and Unblock the Notifications












