Smriti Irani vs Ravi Shastri: కేంద్రమాజీ మంత్రి స్మృతి ఇరానీ చేసిన ఒక ఆసక్తికర వ్యాఖ్య, దానికి టీమిండియా మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఇచ్చిన సున్నితమైన కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. స్మృతి ఇరానీ తన బాల్య జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, రవిశాస్త్రి ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు కొట్టినప్పుడు తాను టీవీలో చూశానని పేర్కొన్నారు. అయితే క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందనతో ఆమె వ్యాఖ్యల వాస్తవికతపై సందేహాలు తలెత్తాయి.
స్మృతి ఇరానీ కామెంట్స్.. బాల్య జ్ఞాపకాలెంతవరకు నిజం?
స్మృతి ఇరానీ ఓ ఇంటర్వ్యూలో ఓ ఇంటిని చూపిస్తూ.. "ఇదిగో.. అక్కడ ఇల్లు కనపడుతుంది కదా.. ఆ ఇంట్లో టీవీ ఉండేది. వాళ్ల కిటికీ దగ్గర నిలబడి టీవీ చూసేవాళ్లం. రవిశాస్త్రి ఒకే ఓవర్లో ఆరు సిక్సులు కొట్టినప్పుడు అక్కడే చూసి.. వీదంతా గోల గోల చేశాం" అని అన్నారు. ఆమె ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు అది ఒక సాధారణ బాల్య జ్ఞాపకంగానే అనిపించింది. టీవీలో క్రికెట్ మ్యాచ్‌లు చూస్తూ సంతోషించిన రోజులను ఆమె గుర్తు చేసుకున్నారు.

అసలు నిజం బయటపెట్టిన మాజీ క్రికెటర్ రవిశాస్త్రి
అయితే స్మృతి ఇరానీ వ్యాఖ్యలకు రవిశాస్త్రి ఇచ్చిన స్పందన ఆమె చెప్పిన దానిపై సందేహాలను కలిగించింది. స్మృతి ఇరానీ వ్యాఖ్యలకు రవిశాస్త్రి స్పందిస్తూ.. "నేను రంజీల్లో 6 సిక్సులు కొట్టినప్పుడు టీవీ బ్రాడ్‌కాస్టింగే లేదు. ఇప్పటివరకు దానికి సంబంధించిన వీడియో కూడా ఎవరి వద్ద లేదు" అని స్పష్టం చేశారు. రవిశాస్త్రి 1985లో బాంబే తరఫున బరోడాపై ఆడుతున్నప్పుడు ఒకే ఓవర్లో 6 సిక్సులు కొట్టి ఈ ఘనత సాధించారు. ఆ రోజుల్లో రంజీ మ్యాచ్‌లకు టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు ఉండేవి కావు.అప్పటి మ్యాచ్‌ల వీడియో రికార్డింగ్‌లు కూడా అరుదుగా ఉండేవి. రవిశాస్త్రి చెప్పినట్లుగా, ఆ అరుదైన ఘట్టానికి సంబంధించిన పూర్తి వీడియో సాక్ష్యం ఇప్పటికీ అందుబాటులో లేదు.
ఒక్క దెబ్బకు స్మృతీ ఇరానీ పరువు పాయే.. నెట్టింట చర్చ
రవిశాస్త్రి కౌంటర్‌తో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. "ఒక్క దెబ్బకు స్మృతీ ఇరానీ పరువు తీసిండు" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. రంజీ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలు ప్రారంభమై రెండు, మూడేళ్లు మాత్రమే అవుతున్నాయి. కానీ స్మృతి ఇరానీ సుమారు 40 ఏళ్ల క్రితం రవిశాస్త్రి కొట్టిన సిక్సులను టీవీలో ప్రత్యక్షంగా చూశాననడం విరుద్ధంగా ఉందని నెటిజన్లు ఎత్తి చూపారు.