
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా ప్రపంచ క్రికెట్‌ను బాల్ టాంపరింగ్ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) తాజా వివరాలను వెల్లడించింది. కేప్‌టౌన్‌లో విచారణ జరిపిన క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ ఇంటెగ్రిటీ లైన్ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్ మేనేజర్ పాట్ హోవార్డ్‌లు బోర్డుకు అందించిన నివేదిక ఆధారంగా స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌పై చర్యలు తీసుకోనున్నారు.
ఆస్ట్రేలియా జట్టులోని ఆటగాళ్లు, కోచ్ లీమన్‌తో పాటు సహాయక సిబ్బందినీ ప్రశ్నించిన అనంతరం రాయ్ నివేదికను రూపొందించారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు బసచేసిన హోటల్లోనూ కీలక సమాచారం సేకరించారు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో జరిగిన బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా జట్టు సమష్టి నిర్ణయం కాదని విచారణ అధికారులు తేల్చారు.
కేవలం కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్, ఓపెనర్ బాన్‌క్రాఫ్ట్‌ల త్రయానికి మాత్రమే ఈ విషయం గురించి తెలుసని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) చేపట్టిన విచారణలో వెల్లడైంది. బాల్ టాంపరింగ్ వివాదంలో మిగతా ఆటగాళ్ల ప్రమేయం ఏమాత్రం లేదని, వారంతా అమాయకులేనని సీఏ సీఈవో జేమ్స్ సదర్లాండ్ ప్రకటించారు. మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో సీఈఓ జేమ్స్ సదర్లాండ్ ఈ విషయాలను వెల్లడించారు.
'బాల్ టాంపరింగ్ వివాదం మా దేశ ప్రతిష్టను దిగజార్చింది. ఈ విషయంలో నేను క్షమాపణలు చెబుతున్నాను. ముఖ్యంగా వీరిని ఆదర్శంగా తీసుకున్న చిన్నారులకు, దక్షిణాఫ్రికాకు.. నాకు అందిన నివేదిక ప్రకారం ఇందులో స్మిత్, వార్నర్, బాన్‌క్రాప్ట్‌లకు మాత్రమే ప్రమేయం ఉంది. ఈ కేసు తీవ్రత నాకు తెలుసు. అయితే జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది' అని అన్నాడు.
'ఇక కోచ్ లీమన్ రాజీనామా చేస్తున్నట్టు వచ్చిన వార్తలు అవాస్తవం. ఆయనకు ఇందులో ఎలాంటి పాత్ర లేదు కాబట్టి కోచ్‌గా కొనసాగుతాడు. మరో 24 గంటల్లో విచారణ పూర్తవుతుంది. అప్పుడే ఆ ముగ్గురిపై మేం ఎలాంటి చర్య తీసుకున్నది వెల్లడిస్తాం. ప్రస్తుతానికి ఆ ముగ్గురు క్రికెటర్లు దక్షిణాఫ్రికాను వదిలి ఆస్ట్రేలియాకు పయమమవుతారు' అని పేర్కొన్నాడు.
'చివరి టెస్టుకు టిమ్ పైన్ నాయకత్వం వహిస్తాడు. ఆస్ట్రేలియా క్రికెట్ తిరిగి మా అభిమానుల మనసు గెలుచుకోవాల్సి ఉంది' అని సదర్లాండ్ తెలిపారు. మరోవైపు ముగ్గురు ఆటగాళ్లపై విధించే శిక్షపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతున్నందున వివరాలను వెల్లడించలేనని తెలిపారు.
బాల్ టాంపరింగ్ వివాదంలో భాగంగా జట్టులోని అందరి ఆటగాళ్లను విచారించామని ఆయన అన్నారు. దీంతో బుధవారం స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్, బాన్‌క్రాఫ్ట్ భవితవ్యమేమిటో తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఈ ముగ్గురూ స్వదేశానికి పయనం కానున్నారు. వారి స్థానంలో రెన్‌షా, మ్యాక్స్‌వెల్, జో బర్న్స్ జట్టులో చేరనున్నారు.

ఈ వ్యవహారంలో హెడ్ కోచ్ డారెన్ లీమన్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇకముందు కూడా అతనే కోచ్‌గా కొనసాగుతాడని వెల్లడించింది. నిజానికి ఆసీస్ మీడియాలో ఈ సంఘటన చోటు చేసుకున్న తర్వాత లీమన్ రాజీనామా చేస్తాడని కథనాలు వచ్చాయి.
అంతేకాదు మూడో టెస్టు మూడో రోజు ఆటలో బాన్‌క్రాఫ్ట్ టాంపరింగ్ వీడియోకు దొరికిపోవడాన్ని గమనించిన లీమన్ ఆందోళన చెందాడు. తానే హ్యాండ్స్‌కోంబ్‌కు వాకీటాకీ ద్వారా సమాచారం ఇచ్చి బాన్‌క్రాప్ట్‌ను అప్రమత్తం చేయించాడు. దీంతో ఈ వివాదంలో అతడి పాత్ర కూడా ఉందని వార్తలు వచ్చాయి. అయితే సీఏ మాత్రం విచారణలో అతడికి క్లీన్‌చిట్ ఇచ్చింది.