హైదరాబాద్: బెంగుళూరు వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన రెండో టెస్టులో ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ 'బ్రెయిన్ ఫేడ్' ఘటనపై ఐసీసీ చర్యలు తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. బెంగుళూరు టెస్టులో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తప్పు చేశానని ఒప్పుకున్నప్పటికీ ఐసీసీ అతడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని గవాస్కర్ ప్రశ్నించాడు.
రెండో టెస్టులో స్టీవ్ స్మిత్ డీఆర్ఎస్ రివ్యూ ఘటనపై ఐసీసీకి సైతం బీసీసీఐ ఫిర్యాదు చేసింది. అయితే ఈ వివాదంలో స్టీవ్ స్మిత్, కోహ్లీపై ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని ఐసీసీ బుధవారం అధికారిక ప్రకటన చేసింది.
'స్టీవ్ స్మిత్, కోహ్లికి సంబంధించి జరిగిన రెండు సంఘటనలు కూడా మ్యాచ్‌లో భాగంగానే ఐసీసీ చూస్తోంది కాబట్టి ఆటగాళ్లపై తదుపరి ఎలాంటి చర్యలు ఉండవు. ఇరు జట్ల ఆటగాళ్ల భావోద్వేగాలు కూడా కీలక పాత్ర పోషించిన అద్భుతమైన టెస్టు మ్యాచ్‌ను మనం చూశాం. రాంచీలో జరిగే మూడో టెస్టు పైనే దృష్టిసారించాలని ఇరు జట్లకూ సూచిస్తున్నాం. టెస్టు ఆరంభానికి ముందు మ్యాచ్ రెఫరీ ఇరు జట్ల కెప్టెన్లనూ పిలిచి వారి బాధ్యతలను గుర్తు చేస్తారు' అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ చెప్పాడు.

ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్యూలో అన్ని దేశాల ఆటగాళ్ల పట్ల ఐసీసీ ఒకే విధంగా ప్రవర్తించాలని, ఏ ఒక్కరి పట్ల వివక్ష చూపకూడదని గవాస్కర్ సూచించాడు. 'రేపు, ఉదాహరణకు తదుపరి టెస్టులో ఒకవేళ స్మిత్ చేసినట్లు ఎవరైనా భారత ఆటగాడు చేస్తే ఐసీసీ ఇలాగే ప్రవర్తిస్తుందా?' అని గవాస్కర్ నిలదీశారు.
'బెంగళూరు టెస్టులో స్మిత్ చేసినట్లు మూడో టెస్టులో కోహ్లీ చేయాలని కోరుకుంటున్నా. అంపైర్ ఔట్ అని ప్రకటించినా అతడు మైదానం వీడకుండా డ్రస్సింగ్ రూమ్ వైపు చూడాలని కోరుకుంటున్నా. అప్పుడేం జరగుతుందో చూద్దాం. మ్యాచ్ రిఫరీలు, ఐసీసీ ఏవిధంగా స్పందిస్తుందో చూద్దాం' అంటూ గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు.
అంతకముందు 'కామెంటరీ బాక్స్‌లో ఉన్న చాలామంది ఈ వివాదం గురించి స్పందించారు. డీఆర్‌ఎస్ రివ్యూ కోరాలా? వద్దా? అనే దానిపై ఆస్ట్రేలియన్లు డ్రెసింగ్ రూమ్ వైపు సైగలు చేస్తున్నారు. అక్కడ ఉన్న తమ కంప్యూటర్ నిపుణుడి సూచనలు తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు' అని అన్నాడు
'ఇది చాలా దారుణం. హ్యాండ్స్‌కోంబ్‌తో చర్చించిన తర్వాత కూడా స్మిత్ నిపుణుడి సైగల కోసం డ్రెసింగ్ రూమ్ వైపు చూశాడు. ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధం. దీనిపై ఐసీసీ, మ్యాచ్ రిఫరీ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి' అని గవాస్కర్ పేర్కొన్నాడు. నాలుగు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇరు జట్ల మధ్య మార్చి 16నుంచి రాంచీలో మూడో టెస్టు ప్రారంభంకానుంది.