
ప్రపంచ టీ20 క్రికెట్ లీగుల్లో ప్రత్యేక స్థానం ఉన్న లీగ్ బిగ్ బ్యాష్ లీగ్. అలాంటి ప్రతిష్ఠాత్మక లీగ్‌లో కొందరు ఆటగాళ్లు తమ జిడ్డు బ్యాటింగ్‌తో సొంత జట్ల ఓటమికి కారణం అవుతున్నారు. తాజాగా కోలిన్ మున్రో కూడా అదే చేశాడు. బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్ మధ్య మ్యాచ్‌లో పరమ చెత్త ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన బ్రిస్బేన్ హీట్ సారధి జిమ్మీ పీర్సన్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అతని ఆశలన్నింటినీ ఓపెనర్లు వమ్ము చేశారు.
మ్యాక్స్ బ్రయాంట్ మొత్తం 7 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేసి పెవలియన్ చేరాడు. మరో ఓపెనర్ కోలిన్ మున్రో (47 బంతుల్లో 43) కూడా నిదానంగా ఆడాడు. ఆ తర్వాత వచ్చిన ఆటగాళ్లు కూడా ఎవరూ ధాటిగా ఆడలేదు. మ్యాట్ రెన్ షా (9), శామ్ బిల్లింగ్స్ (1) కూడా విఫలమయ్యారు. కెప్టెన్ జిమ్మీ పీర్సన్ (27) కొంత ఫర్వాలేదనిపించాడు. రాస్ వైట్లీ (8 నాటౌట్), మైకేల్ నెసార్ (0) కూడా రాణించలేదు. అయితే చివర్లో గ్జేవియర్ బార్లెట్ (28 నాటౌట్) వేగంగా ఆడాడు. దీంతో బ్రిస్బేన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
లక్ష్య ఛేదనలో సిడ్నీ థండర్ ఏమాత్రం తడబాటు ప్రదర్శించలేదు. అప్పటి వరకు బౌలర్లకు సహకరిస్తున్న పిచ్‌పై ఛేజింగ్ కష్టంగా ఉంటుందని అనుకున్న ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించేలా థండర్ ఓపెనర్లు దుమ్ముదులిపేశారు. మాథ్యూ గైక్స్ (56 నాటౌట్), అలెక్స్ హేల్స్ (59 నాటౌట్) ఇద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీళ్లిద్దరూ ధాటిగా ఆడటంతో థండర్ జట్టు కేవలం 11.4 ఓవర్లలోనే వికెట్లేమీ కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. మాథ్యూ గైక్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.